పెద్దనోట్ల రద్దు ఎక్కడికి దారితీస్తుందో

16 Nov, 2016 15:08 IST|Sakshi
పెద్దనోట్ల రద్దు ఎక్కడికి దారితీస్తుందో
దేశంలో 'మాంద్యం' తప్పదా?
 
(ఇంటర్నెట్ ప్రత్యేక కథనం)
 
హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దు దేశంలో ఆర్థికమాంద్యానికి దారితీస్తుందా? నోట్ల రద్దు తర్వాత అవసరమైనంత కరెన్సీని అందుబాటులో ఉంచకపోవడం వల్ల ఇప్పటికే పలు వ్యాపారాలు కుదేలయ్యాయి. బ్యాంకుల నుండి సరిపడినంత డబ్బు తీసుకునే వెసులుబాటు లేక చిన్నవ్యాపారులు చితికిపోతున్నారు. మార్కెట్లో వారు సైతం డబ్బుతోనే సరుకులు కొనుగోలు చేయవలసి రావడం చేత క్రమేపి వారి వ్యాపారాలు మందగిస్తున్నాయి. చాలా దుకాణాల్లో సరుకులు సన్నగిలిపోయాయి. స్థిరాస్తి లావాదేవీలు స్తంభించాయి. వ్యవసాయక కొనుగోళ్లు, అమ్మకాల్లో మున్నెన్నడూ ఎరుగని  స్తబ్ధత ఏర్పడింది.
 
ఈ ఏడాది కురిసిన మంచి వర్షాల వల్ల ఒనగూరే ప్రయోజనాన్ని కూడా ఈ చర్య వల్ల చేజేతులారా దెబ్బతీసుకున్నట్లైంది. రబీ సీజన్-లో విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల దగ్గరి నుంచి వ్యవసాయ కూలీలకు చెల్లింపుల వరకు అంతా అయోమయం నెలకొంది. పండిన పంటలకు కూడా గిట్టుబాటయ్యే ధరలు లేని దుస్థితి. వ్యవసాయ రంగం అంతా ప్రధానంగా నగదు చెల్లింపులపైనే నడుస్తుండడం వల్ల ప్రభుత్వం తీసుకున్న ఆకస్మిక నిర్ణయం వ్యతిరేక ఫలితాలనే ఇవ్వనుందని ప్రముఖ గణాంకవేత్త ప్రొఫెసర్ ప్రణబ్ కే సేన్ అభిప్రాయపడుతున్నారు.
 
పరిస్థితి ఇలాగే ఉంటే ఈ సారి వార్షిక వృద్ధిరేటు 7 శాతం కంటే తక్కువగానే నమోదు కావచ్చునని ఆయన వ్యాఖ్యానించారు. ద్రవ్య చలామణి మందగించడంతో పాటు లెక్కల్లోకి రాని డబ్బు యావత్తు బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చే అవకాశం లేకపోవడం మూలాన  ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 1.1 మేరకు తగ్గవచ్చని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ (NIPFP) కి చెందిన ప్రొఫెసర్ ఎన్ ఆర్ భానుమూర్తి హెచ్చరిస్తున్నారు. సాధారణంగా వరుసగా రెండు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధిరేటు తగ్గితే దానిని రెసిషన్ గా వ్యవహరిస్తారు.
 
ఏప్రిల్-జూన్ మొదటి త్రైమాసికంలో భారత వృద్ధిరేటు కాస్త తగ్గి 7.1 శాతంగా నమోదైంది. నిరుడు ఇదే త్రైమాసికంలో ఇది 7.5 శాతంగా ఉండింది. మంచి వర్షాల వల్ల 2016 -17లో 8 శాతం వార్షిక వృద్ధిరేటు ఉండగలదని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఇప్పటి పరిస్థితుల్లో ఆ స్థాయి వృద్ధిరేటును సాధించడం సాధ్యం కాదని ఆర్థికవేత్తలు అంటున్నారు. 
 
1978లో వెయ్యి నోటు రద్దు జరిగినప్పుడు కూడా 25 శాతం డబ్బు బ్యాంకుల్లోకి రాలేదు. ఈసారి కూడా 25 శాతం నల్లధనం బ్యాంకుల్లో జమకాకపోవచ్చునని SBI రూపొందించిన ఒక నివేదిక అంచనా వేసింది. దేశంలో ఈ పర్యాయం 45 లక్షల కోట్ల రూపాయల నల్లధనంలో కనీసం 20 శాతం- అంటే రూ. 9 లక్షల కోట్లు బ్యాంకుల్లో జమ కాకపోవచ్చునని ఆ నివేదిక పేర్కొంది. నిజానికి ఇది 20 లక్షల కోట్ల యినా కావచ్చు. అంతకు మించి కూడా ఉండొచ్చు. ఎందుకంటే దేశంలో నల్లధనం ఎంతన్నది ఎవరికీ అంతుచిక్కనిది. దానిమీద అంచనాలు కట్టడం అన్నివేళలా వాస్తవం కాకపోవచ్చు. ప్రభుత్వానికి చిక్కని ప్రత్యామ్నాయమార్గాల ద్వారా నల్లధనం మార్పిడికి  కూడా కొన్ని అవకాశాలు ఉండనే ఉన్నాయి.

రోజూ వారి లావాదేవీల్లో నోట్ల వినియోగంపై ఆర్బీఐ చెబుతున్న గణాంకాలు



మురిగిపోయిన అప్పులు!
ఇక దేశంలో ప్రభుత్వరంగబ్యాంకుల నిరర్థక ఆస్తుల (NPA) విలువ కూడా తక్కువేమీ కాదు. ప్రస్తుతం అవి 7.6 శాతం చేరుకున్నాయి. అవి 2017 మార్చి నాటికి 8.5 శాతానికి చేరవచ్చునని అంచనా. 2015-16 త్రైమాసికంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల నిరర్థక ఆస్తులు ఏకంగా 5.8 లక్షల కోట్లకు చేరాయి. ఇవి గోడకు కొట్టిన సున్నం లాంటి తిరిగిరాని మురి(ని)గిపోయిన అప్పులు! విజయ మాల్యా వంటివాళ్ల చేతుల్లోకి అవి చేరిపోయాయి. ఈ కారణంగా 25 ప్రభుత్వబ్యాంకుల్లో ఇప్పటికే కనీసం 15 బ్యాంకులు సంక్షోభంలో ఉన్నాయి. 
 
ఇప్పుడున్న పరిస్థితుల్లో 2017-18 సంవత్సరానికిగాను క్రెడిట్ అవసరాల నిమిత్తం ప్రభుత్వరంగబ్యాంకులకు 36 వేల కోట్ల రూపాయల మేరకు నిధులు కావాలి. మోదీ ప్రవేశపెట్టిన ముద్రా బ్యాంక్, స్టార్టప్ ఇండియా, గోల్డ్ మానిటైజేషన్ వంటి పథకాలు బ్యాంకుల కష్టాలను మరింత పెంచాయి. ప్రభుత్వపథకాలేవీ సరిగా అమలు కాకపోవడానికి బ్యాంకుల వద్ద వాటికి సరిపడా ద్రవ్యం లేకపోవడం ఒక ప్రధాన కారణం. పెద్దనోట్ల రద్దు వల్ల ప్రభుత్వం ఆశిస్తోంది ప్రధానంగా "ద్రవ్యం" కావచ్చు. అయితే అది ఏ మేరకు అందివస్తుందో కాలమే తేల్చాలి!
 
దేశంలో 4 కోట్ల మంది చిన్నతరహా వ్యాపారులు ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. మన జాతీయ స్థూల ఉత్పత్తిలో ఈ రంగం 8 శాతం వాటాను కలిగి ఉంది. దీనికి  (Micro, small and medium enterprises - MSME) వస్తువుల ఉత్పత్తిలో 45 శాతం, ఎగుమతులలో40 శాతం వాటా ఉండడం విశేషం. వ్యవసాయం తర్వాత దేశంలో అత్యధికంగా ఉద్యోగితను కల్పించే రంగం ఇది.
 
ఇప్పుడు పెద్దనోట్ల రద్దుతో ఈ రంగం పెనుసంక్షోభంలో చిక్కుకుపోయింది. కరెన్సీ లభ్యత తగ్గిపోవడమంటే అది ప్రజల కొనుగోలుశక్తి తగ్గడమే. కొనుగోలు శక్తిని ప్రభుత్వం హరించడమంటే అది దేశంలో వస్తూత్పత్తికి గిరాకీ తగ్గించడమే అవుతుంది. అలా ఇది ద్రవ్యోల్బణం నుండి తొలుత ద్రవ్యమాంద్యానికి...అంతిమంగా ఆర్థిక మాంద్యానికీ దారితీస్తుందన్న భయసందేహాలు కలుగుతున్నాయి.
 
బ్యాంకుల జాతీయకరణ నిర్ణయం తీసుకున్నప్పుడు నాటి ప్రధాని ఇందిరాగాంధీ పలువురు స్వతంత్ర ఆర్థికవేత్తలతో విపులంగా చర్చించారు. దాని లాభనష్టాలను బేరీజు వేశాకే ప్రకటన చేశారు. ఇప్పుడు బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం కేవలం తమ ఆలోచనలకు తలాడించే ఆర్థికశాఖ అధికారులపైనే ఆధారపడినట్లు కనిపిస్తోంది. పెద్దనోట్ల రద్దుపై పెద్దగా అధ్యయనం లేకుండానే నిర్ణయం తీసుకోవడం వల్ల దాని దుష్పరిమాణాలకు సిద్ధం కావలసిందేనని ప్రభాత్ పట్నాయక్ వంటి ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 
నిజానికి 2014 నుండే వెయ్యి, ఐదు వందల రూపాయల నోట్ల వాడకం విపరీతంగా పెరిగింది. (దీనిని గ్రాఫ్ ద్వారా చూడవచ్చు). రిజర్వ్ బ్యాంక్ లెక్కల ప్రకారం ప్రస్తుత ఆర్థిక వ్యవస్థలో రూ.16.4 లక్షల కోట్లు చలామణిలో ఉన్నాయి. వీటిలో రూ.6.3 లక్షల కోట్లు అంటే 38.6 శాతం వెయ్యి రూపాయల నోట్లు. కాగా రూ.7.8 లక్షల కోట్లు అంటే 47.8 శాతం ఐదు వందల రూపాయల నోట్లు. వీటి రద్దుతో ఏకంగా 86.4 శాతం కరెన్సీని చెల్లుబాటు కాకుండా చేశారు. ఒకనాటి చాయ్-వాలాగా చెప్పుకునే మోదీ ఇప్పుటి చాయ్-వాలాలతో సహా రోజువారీ కష్టం మీద బతికే బడుగుజీవులకు మాత్రం పూట గడవకుండా చేశారు.

ప్రశ్నార్థకంగా మారనున్న నిత్యవసర సరుకుల వినియోగం



పెరిగిన ధరలు!
తాజా వినియోగ ధరల సూచీ ప్రకారం దేశంలో 2016 అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం 4.2 శాతంగా నమోదైంది. సెప్టెంబర్ లో ఇది 4.39. కాగా నిరుడు 5 శాతంగా ఉండింది. అధికారిక గణాంకాల ప్రకారం "ద్రవ్యోల్బణం" తగ్గింది. కానీ ఆహార దినుసుల ధరలు ఏ మాత్రం తగ్గలేదు. పైగా మరింత పెరిగాయి. రిజర్వ్ బ్యాంకు గణాంకాల ప్రకారం ఏప్రిల్-జూలై 2016 త్రైమా సికంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను ఆహారద్రవ్యోల్బణం కుదిపివేసింది. పప్పుధాన్యాలకు సంబంధించి తెలంగాణలో సగటున 37.6 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది. అలాగే మసాలా దినుసుల్లో 15.4 శాతం, పండ్లధరల్లో 13.1 శాతం  ద్రవ్యోల్బణం నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పప్పుధాన్యాలకు సంబం ధించి 34.7 శాతం ద్రవ్యోల్బణం ఉన్నట్లు వెల్లడైంది.
 
పెద్దనోట్లను ఆకస్మికంగా రద్దు చేయడంతో మోదీ దేశంలో ఒక మోస్తరు ధనవంతుల నల్లధనానికి ఒక మేరకు చెక్ పెట్టగలిగి ఉండవచ్చు. కానీ ద్రవ్యం సరిపడా చలా మణిలో లేని పరిస్థితులను సృష్టించడం అంతిమంగా ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యానికి చేటు చేస్తుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు. రద్దు చేయదలిస్తే వెయ్యి నోట్లను ఎందుకు అంత విస్తారంగా, అనాలోచితంగా చలామణిలోకి తెచ్చినట్లో మోదీ మాత్రమే చెప్పగలరు. ఏదిఏమైనా దశలవారీగా, శాస్త్రీయంగా, ప్రణాళికాబద్ధంగా చేయవలసిన పనిని హఠాత్తుగా చేయడం వల్ల దుష్పరిమాణాలు తప్పకపోవచ్చు. ఒక మంచి పనిని సరైన రీతిలో చేయకపోవడం కూడా చెడుఫలితాలకే దారితీస్తుందని మోదీ ఆలస్యంగానైనా గ్రహించవలసి వస్తుంది.
>
మరిన్ని వార్తలు