కరోనా వచ్చిందేమో మీరే చెక్‌ చేసుకోండిలా!

15 Apr, 2020 16:35 IST|Sakshi

కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలన్నింటిని వణికిస్తోంది. ఈ వైరస్‌ వ్యాప్తి చాలా తొందరగా, తేలిక జరుగుతుంటంతో దీన్ని అరికట్టడంతో చాలా కష్టంగా ఉంది. దీంతో దీన్ని కట్టడి చేయడానికి ప్రపంచ దేశాలు అనేక మార్గాలను అనుసరిస్తున్నాయి. అందులో భాగంగానే భారత ప్రభుత్వం లాక్‌డౌన్‌ను విధించి ప్రతి ఒక్కరు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటుంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా దేశంలో కరోనా కేసులు సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం సరికొత్త ఆలోచన చేసింది. కరోనాను దరి చేరకుండా అడ్డుకునేందుకు ఒక ప్రతేకమైన యాప్‌ను ఆరోగ్యసేతు పేరుతో  రూపొందించింది. ఆరోగ్య సేతు అనేది ఒక సంస్కృత పదం. ఆరోగ్యానికి వంతెన అని దీని అర్థం.  ఇది మనం  కరోనా బారిన పడకుండా ఉండేందుకు సహకరిస్తుంది. కోవిడ్‌-19 బారిన పడిన వారు మన దగ్గరికి సమీపిస్తే మనల్ని హెచ్చరిస్తుంది. దీనికంటే ముందు కరోనా గురించి అవగాహన కల్పించడానికి మైగావ్‌ యాప్‌ ఉన్నప్పటికి ఈ ఆరోగ్య సేతు యాప్‌ కేవలం కరోనా కోసమే రూపొందించబడింది. అయితే ఈ యాప్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. ఎలా ఉపయోగించాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

ముందుగా ఈ యాప్‌ను ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లలో, ఐఫోన్‌లో కూడా ఇన్‌స్టాల్‌ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఫోన్‌లో గూగుల్ ప్లే స్టోర్‌ నుంచి, ఐఫోన్‌ల కోసం యాప్ స్టోర్‌లో నుంచి డౌన్లోడ్‌ చేసుకోవాలి. ఆ తరువాత పేరు, మొబైల్‌ నంబర్‌తో రిజిస్టార్‌ చేసుకోవాలి. వీటితోపాటు మన ఆరోగ్య విషయాలను. ఇతర ఆధారాలను నమోదు చేయాలి. ట్రాకింగ్‌ను ప్రారంభించడం కోసం ఫోన్‌లో జీపీఎస్‌, బ్లూటూత్‌ సిస్టమ్‌ను ఆన్‌లో ఉంచాలి. అలో ఆల్‌వేస్‌ అనే ఆప్షన్‌ను క్లిక్‌ చేయాలి. 

ఈ యాప్‌ మనం కరోనా పాజిటివ్‌ వ్యక్తులకు దగ్గరగా ఉంటే మనల్ని అప్రమత్తం చేస్తుంది. ఒక వేళ వారికి దగ్గరగా వెళితే మనకి కరోనా బారిన పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో తెలియజేస్తుంది. కరోనావైరస్ ఉన్న వ్య‌క్తికి దగ్గరగా వెళ్తే యాప్ మీ లొకేష‌న్ స్కాన్ చేసి.. మీ డేటాను ప్ర‌భుత్వానికి చేర‌వేస్తుంది. కేంద్ర‌, రాష్ట్ర‌ ఆరోగ్య మంత్రిత్వ శాఖ చేసే ప్ర‌క‌ట‌న‌లు, తీసుకునే చ‌ర్య‌లను తెలియజేస్తుంది. దేశంలో కరోనా అప్‌డేట్స్‌ని ఎప్పటికప్పుడు అందిస్తుంది. కోవిడ్ -19 లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని నిర్థారించ‌డానికి అనేక ప్రశ్నలను అడిగే ప్రత్యేకమైన చాట్‌బోట్ ఉంటుంది. ఒకవేళ మీరు అత్యంత ప్రమాదకర వాతావరణంలో ఉంటే కరోనా సోకినట్లు టెస్ట్‌ చేయించుకోవాలంటే టోల్‌ ఫ్రీ నంబర్‌ 1075కి కాల్‌ చేస్తే మీకు దగ్గరలో ఉంటే టెస్టింగ్‌ సెంటర్‌లో అపాయింట్‌మెంట్‌ లభిస్తుంది. ప్రస్తుతం ఆరోగ్య సేతు యాప్‌ ఇంగ్లీష్‌, హిందీ భాషలతో కలిపి  11 భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో మీ సమాచారమంతా ర‌హ‌స్యంగా ఉంటుంది. ప్ర‌భుత్వానికి త‌ప్ప ఎవ‌రికి తెలిసే అవ‌కాశం ఉండదు. అత్యాధునిక టెక్నాలజీ, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ద్వారా ఈ యాప్‌ పనిచేస్తుంది.ఇప్పటి వరకు భారతదేశంలో 11,555 కేసులు నమోదు కాగా, 396 మంది మరణించారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు సంఖ్య 20 లక్షలు దాటగా, 1,26,811 మంది చనిపోయారు. 

మరిన్ని వార్తలు