సాహో... సీతారామన్‌

5 Jul, 2019 10:56 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశానికి తొలి  మహిళా స్వతంత్ర ఆర్థికమంత్రిని పరిచయం చేసి ఎన్‌డీఏ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆర్థికమంత్రిగా ఉన్న అరుణ్‌ జైట్లీ అనారోగ్య కారణాలతో  బాధ్యతలనుంచి తప్పించాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీని వేడుకున్న నేపథ్యంలో ఆర్థికమంత్రిగా కీలక బాధ్యతలను నిర్మలా సీతారామన్‌కు అప్పగించారు. దీంతో దేశంలో స్వతంత్ర ఆర్థికమంత్రి బాధ్యతలను చేపట్టిన తొలి మహిళగా నిర్మలా సీతారామన్‌ నిలిచారు. అంతేకాదు బడ్జెట్‌ పత్రాల బ్రీఫ్‌ కేస్‌ సాంప్రదాయానికి స్వస్తిపలికి ఆమె ఎర్రటి బ్యాగ్‌లో బడ్జెట్ పత్రాలు తీసుకురావడం గమనార‍్హం. ఈ ఉదయం 11 గంటలకు పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు కేంద్ర క్యాబినెట్‌ ఆమోదం లభించింది.

ముఖ్యంగా రక్షణ, వాణిజ్యమంత్రిగా తనదైన  రీతిలో ఆకట్టుకున్న నిర్మలా సీతారామన్‌ ఆర్థికమంత్రి గా ఎలాంటి మ్యాజిక్‌ చేయనున్నారనేది మరికొద్ది  క్షణాల్లో తేట తెల్లంకానుంది. మహిళగా  దేశానికి, దేశ ఆర్థిక రంగానికి ఎలాంటి శక్తిని అందించనున్నారు.  పాతాళానికి పడిపోయిన జీడీపీకి ఊపిరి పోయనున్నారా?  అల్పాదాయ,మధ్య తరగతి వర్గాలకు ఎలాంటి ఊరట కల్పించానున్నారు. కార్పొరేట్‌, వ్యాపార వర్గాలకు ఎలాంటి ఆశలు కల్పించనున్నారనేది కీలకం కానుంది. అలాగే మోదీ  సర్కార్‌  మొదటినుంచి చెప్పుకుంటూ వస్తున్న నల్లధనం, అవినీతిపై యుద్ధాన్ని ఎలా అమలు చేయబోతున్నారు. సామాన్యుడి ఆశలు, కలలు నెరవేరనున్నాయా? నిర్మలా సీతారామన్‌ తన మహిళా శక్తిని యుక్తిని ఎలా ప్రదర్శించబోతున్నారు. ఇలాంటి ప్రశ్నలకు సమాధానం మరికొద్ది క్షణాల్లో మన ముందు ఆవిష్కృతం కానుంది. ఈ నేపథ్యంలో సోషల్‌ మీడియాలో,  బీజేపీ శ్రేణులు, పలువురు రాజకీయ విమర్శకులు సాహో..  సీతారామన్‌ అంటూ అభినందనలు చెబుతుండటం విశేషం.

మరిన్ని వార్తలు