స్కూళ్ల పునఃప్రారంభంపై సంప్రదింపులు షురూ

9 Jun, 2020 06:00 IST|Sakshi

రాష్ట్రాలతో చర్చిస్తున్న మానవ వనరుల మంత్రిత్వ శాఖ 

తుది నిర్ణయం కేంద్ర హోంశాఖదే 

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి నెలలో మూతపడిన పాఠశాలలను ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలన్న దానిపై కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ రాష్ట్రాలు, ఈ అంశంతో సంబంధం ఉన్న వారితో(స్టేక్‌ హోల్డర్లు) చర్చిస్తోంది. సోమవారం సంప్రదింపులు ప్రారంభించినట్లు అధికారులు తెలిపారు. స్కూల్‌ ఎడ్యుకేషన్‌ కార్యదర్శి అనితా కార్వాల్‌ వివిధ రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో మాట్లాడారు. పాఠశాలలను తెరవడంపై యాజమాన్యాల సన్నద్ధత, విద్యార్థుల ఆరోగ్యం, పాఠశాలల్లో పరిశుభ్రత, ఆన్‌లైన్, డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ తదితర అంశాలపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు.  

వారి భద్రతకు అత్యధిక ప్రాధాన్యం
పాఠశాలల పునఃప్రారంభంపై రాష్ట్రాల నుంచి వచ్చిన అభిప్రాయాలను క్షుణ్నంగా పరిశీలించి, తదుపరి చర్యల నిమిత్తం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు, హోంశాఖకు నివేదించనున్నట్లు మానవ వనరుల అభవృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. రాష్ట్రాలతో సంప్రదింపులు ఇప్పుడే మొదలయ్యాయని, స్కూళ్ల పునఃప్రారంభంపై తుది నిర్ణయం కేంద్ర హోంశాఖదేనని అధికార వర్గాలు పేర్కొన్నాయి.  
 

మరిన్ని వార్తలు