ఇక నకిలీ విద్యాలయాల ఆటకట్టు..!!

27 Jun, 2018 17:51 IST|Sakshi
మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ (ఫైల్‌ ఫోటో)

సాక్షి, న్యూఢిల్లీ : విద్యావ్యవస్థ పటిష్టానికి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) స్థానంలో హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌(హెచ్‌ఈసీ)ను తీసుకురానుంది. ఈ మేరకు మానవ వనరుల శాఖ అధికారులు ముసాయిదా బిల్లు తయారు చేశారని కేంద్రం తెలిపింది. విద్యారంగంలోకి విదేశీ పెట్టుబడులకు అవకాశం కల్పిస్తారనే ఊహాగానాలు వెలుడుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ ప్రకటన చేయడం గమనార్హం. హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌తో భారతీయ విద్యారంగం మరింతగా బలోపేతమవుతుందని కేంద్రం భావిస్తోంది. విద్యాసంస్థల్లో మితిమీరిన ప్రభుత్వ జోక్యాన్ని తగ్గించేందుకే నూతన కమిషన్‌కు రూపకల్ప చేసినట్టు మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు.

విద్యాసంస్థల్లో తనిఖీల పేరిట జరుగుతున్న అక్రమాలను హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌తో అరికట్టొచ్చని ధీమా వ్యక్తం చేశారు. తనిఖీల పేరిట జరుగుతున్న అక్రమాలు ఇకపై సాగవని మంత్రి అన్నారు. ప్రమాణాలు పాటించకుండా కొనసాగుతున్న నకిలీ విద్యాలయాల ఆటకట్టిస్తామని పేర్కొన్నారు. ఇకపై విద్యాసంస్థలు సాధించే ప్రగతి ఆధారంగానే వాటి భవితవ్యం ఆధారపడుతుందని ఆయన స్పష్టం చేశారు. కొత్త కమిషన్‌ రాకతో యూజీసీ కార్యకాలాపాలను మానవ వనరుల శాఖ చేపట్టనుండగా, విద్యా సంబంధ వ్యవహారాలపై హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ కమిషన్‌ దృష్టి సారించనుంది. ఏఐసీటీఈ, యూజీలను రద్దు చేస్తున్నందున కొత్త నియమ నిబంధనల రూపకల్పనకు హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఎంపవర్‌మెంట్‌ రెగ్యులేషన్‌ ఏజన్సీని ఏర్పాటు చేయబోతున్నట్టు కేంద్రం వెల్లడించింది. జూలై 7 వరకు నూతన కమిషన్‌కు సలహాలు సూచనలు అందించాలని హెచ్చార్డీ ప్రజల్ని కోరింది.

మరిన్ని వార్తలు