శానిటరీ ప్యాడ్‌ వాడిందెవరు?

27 Mar, 2018 07:52 IST|Sakshi
వార్డెన్‌ ఇంటి ముందు నిరసన చేపట్టిన విద్యార్థులు

బట్టలువిప్పి 40 మంది విద్యార్థినులను చెక్‌చేసిన హాస్టల్‌ వార్డెన్‌

మధ్యప్రదేశ్‌ యూనివర్సిటీ హాస్టల్‌లో వార్డెన్‌ వికృత చర్య

వార్డెన్‌ ఇంటి ఎదుట విద్యార్థినుల నిరసన, యూనివర్సిటీ వీసీ క్షమాపణ

భోపాల్‌ : స్త్రీల సహజసిద్ధ రుతుక్రమాన్ని అర్థం చేసుకొనేందుకు ఈ సమాజానికి ఇంకెంత కాలం పడుతుందోనన్న అనుమానం ఈ ఘటనతో మరింత బలపడుతోంది. శానిటరీ నాప్‌కిన్స్‌ తయారుచేసే యంత్రాన్ని తొలిసారిగా పరిచయం చేసిన మధ్యప్రదేశ్‌లోని డాక్టర్‌ హరిసింగ్‌ గౌర్‌ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటన అమ్మాయిల పట్ల వివక్షనీ, అవమానకర వైఖరిని మరోమారు రుజువుచేసింది. మధ్యప్రదేశ్‌లోని డాక్టర్‌ హరిసింఘ్‌ గౌర్‌ యూనివర్సిటీ కి చెందిన హాస్టల్‌లో వాడిపడేసిన శానిటరీ ప్యాడ్‌ కనిపించడంతో, దాన్ని వాడిందెవరో తెలుసుకునేందుకు ఒక్కొక్కరుగా విద్యార్థులందరి దుస్తులనూ విప్పించి చెక్‌చేయడం వివాదానికి తెరతీసింది.

విద్యార్థులను అవమానించిన రాణీ లక్ష్మీబాయి హాస్టల్‌ వార్డెన్‌ చందాబెన్‌ వైఖరికి వ్యతిరేకంగా ఆమె ఇంటిముందు విద్యార్థులు ఆందోళనకి దిగడంతో విషయం వెలుగులోనికి వచ్చింది. హాస్టల్‌లో కనిపించిన శానిటరీ ప్యాడ్‌ ఎవరు వాడారో తెలుసుకోవడం కోసం రాణీ లక్ష్మీబాయి  హాస్టల్‌ వార్డెన్‌ చందాబెన్‌ తమ బట్టలు విప్పించి అవమానించారని యూనివర్సిటీ వైస్‌ ఛాన్సలర్‌ ఆర్‌పి తివారీకి విద్యార్థులు ఫిర్యాదు చేసారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన యూనివర్సిటీ విసి ఆర్‌పి తివారీ విద్యార్థులకు క్షమాపణ చెప్పారు. ఘటనపై ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని నియమించడంతో పాటు,  వార్డెన్‌ తప్పిదం రుజువైతే కఠినంగా శిక్షిస్తామని విద్యార్థులకు హామీ ఇవ్వడంతో  విషయం సద్దుమణిగింది. 

విచిత్రమైన విషయమేమిటంటే రుతుక్రమం పట్ల విద్యార్థుల్లో అవగాహన కల్పించేందుకూ, అమ్మాయిల్లో డ్రాప్‌ఔట్‌ రేట్‌ ని తగ్గించే ఉన్నతమైన లక్ష్యంతోనూ, పేద విద్యార్థులకు ఉచితంగా శానిటరీ ప్యాడ్స్‌ని అందించేందుకు దేశంలోనే తొలిసారిగా భోపాల్‌లోని మోడల్‌ హైస్కూల్స్‌లో శానిటరీ నాప్‌కీన్స్‌ తయారుచేసే మిషన్స్‌ ని అమర్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా శానిటరీ ప్యాడ్స్‌ తీసుకునేందుకు విద్యార్థినులకు ప్రత్యేకమైన కాయిన్స్‌ని యిస్తుంది. ప్యాడ్స్‌ అవసరమైనప్పుడు ఆ కాయిన్స్‌ని ఇచ్చి విద్యార్థులు ప్యాడ్స్‌ని ఉపయోగించుకొనే సౌలభ్యం ఉంటుంది. ఇంత ప్రయోజనకరమైన ప్రాజెక్ట్‌ని తొలిసారిగా ప్రవేశపెట్టిన రాష్ట్రంలోనే శానిటరీ న్యాప్‌కీన్‌ వాడిపడేసినందుకు విద్యార్థులను అవమానించిన ఘటన ఉత్పన్నం కావడం చర్చనీయాంశం అయ్యింది.

అనేక దశాబ్దాలుగా స్త్రీల హక్కులను గురించి, వారి శారీరక శాస్త్రీయతను అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకతను గురించీ పదే పదే మహిళలు విభిన్న రీతుల్లో ఉద్యమిస్తూనే ఉన్నారు. దానికి తోడు అక్షయ్‌ కుమార్‌ ‘ప్యాడ్‌మాన్‌’ సినిమా తీసుకొచ్చిన చైతన్యం  నేపథ్యంలో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా 200 ప్రధాన రైల్వే స్టేషన్లలో శానిటరీ నాప్‌కిన్‌ మెషిన్స్‌ని ప్రారంభించామనీ, వెనుకబడిన, బలహీన వర్గాల స్త్రీలకూ, మహిళా ఉద్యోగులకు ఎంతగానో ఉపయోగకరమనీ  రైల్వే బోర్డు ఛైర్మన్‌ అశ్వినీ లోహనీ వ్యాఖ్యానించారు. అయితే అక్షయ్‌ కుమార్‌ ‘పాడ్‌మాన్‌’ తరహా సినిమాలు మాత్రమే ఆశించిన మార్పుని తేలేవన్న విషయాన్ని ఈ ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 

– సాక్షి నాలెడ్జ్‌ సెంటర్‌

మరిన్ని వార్తలు