విన్న వెంటనే.. అన్నీ ఉల్టాగానే..

29 Jun, 2019 10:33 IST|Sakshi

సాక్షి, బెంగళూరు : ప్రతి ఒక్కరిలో ఏదో ఒక కళ, ప్రతిభ దాగి ఉంటుందని పెద్దలు చెబుతుంటారు. కొందరు పాటలు పాటడంలోను, మరికొందరు క్రీడల్లోను, ఇంకొందరు వివిధ వృత్తుల్లోనూ రాణిస్తుంటారు. ఉల్టా పద్ధతిలో పాటలు పాడుతూ పలువురి నుంచి ప్రశంసలు అందుకుంటున్న వారు సైతం ఉండటం విశేషం. కళలకు పుట్టినిల్లైన ధారవాడ జిల్లాలో ప్రతిభావంతులకు కొదవ లేదు. జిల్లాలోని హుబ్బళ్లికి చెందిన ఓ అమ్మాయి తాను విన్న పాటలను..వెంటనే తిరగేసి పాడటంలో దిట్టగా పేరుగాంచి అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది. ఆమె పేరు తనుశ్రీ మసనీ.

పిచ్చిదనుకుని తిట్టిపోశారట!
స్థానిక జర్నలిస్ట్‌ కాలనీకి చెందిన తనుశ్రీ మసనీ ప్రతిభావంతురాలు. ప్రముఖ కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌ నటించిన రాజకుమార చిత్రంలో బొంబె హేళుతైతే అనే పాటను తనుశ్రీ మసనీ ఉల్టా పాడి పలువురి చేత శభాష్‌ అనిపించుకుంది. అంతేకాక ఆమె ఉల్టాగా మాట్లాడే కళను వంట పట్టించుకుంది. ఈమె మాట్లాడటం చూస్తే ఇది ఏ భాష అన్న అనుమానం రాక మానదు. ప్రారంభంలో ఉల్టా మాట్లాడటాన్ని తమాషాగా అనుకుంది. అలా క్రమేణా చదివేటప్పుడు, స్నేహితులతో మాట్లాడేటప్పుడు దీన్ని అభ్యాసంగా చేసుకుంది. ప్రస్తుతం తనుశ్రీ తెలుగు, కన్నడ, ఇంగ్లీష్, హిందీ తదితర భాషల పాటలను ఉల్టా(రివర్స్‌) పాడటం ద్వారా అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సుమారు 10 ఏళ్ల నుంచి ఈ విభిన్న కళను అభ్యాసం చేస్తూ ప్రతిభావనిగా పేరు గడించింది. మొదట్లో కుటుంబ సభ్యులు ఈమె మాట్లాడటం చూసి పిచ్చిదనుకున్ని తిట్టి పోశారట. అయితే రానురాను ఆమెలో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి కుటుంబ సభ్యులు కూడా తగిన ప్రోత్సాహం అందించారు.

మరిన్ని వార్తలు