'ఇక ఆ వాచీ పెట్టుకోను'

26 Feb, 2016 13:25 IST|Sakshi
'ఇక ఆ వాచీ పెట్టుకోను'
సాక్షి,బెంగళూరు:  తాను ధరించిన ఖరీదైన వాచ్‌పై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మొదటిసారిగా నోరు విప్పారు. సదరు వాచ్‌ను విధానసౌధలో క్యాబినెట్ మీటింగ్ జరిగే కార్యాలయంలో పెడుతానన్నారు. ఆ వాచ్‌ను ఇక ధరించబోనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి సిద్దరామయ్య రూ.70 లక్షల విలువైన వాచ్‌ను ధరిస్తున్నట్టు జేడీఎస్ రాష్ట్రాధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ విషయం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం లేపడంతో పాటు సీఎం సిద్ధు వ్యవహార శైలి పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తనపై ఆరోపణలు వచ్చిన దాదాపు పదిహేను రోజుల తర్వాత గురువారం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆ వాచ్‌కు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
 
‘ఆ వాచ్‌ను  కేరళకు చెందిన డాక్టర్ గోపాల పిళ్లై గిరీష్ చంద్ర వర్మ నాకు ఇచ్చారు. ఆయన దావణగెరెలో ఎంబీబీఎస్, మంగళూరులో ఎం.ఎస్ చేశారు. అటుపై వివిధ దేశాల్లో ప్రాక్టీస్ కొనసాగించి ప్రస్తుతం దుబాయిలో స్థిరపడ్డారు. నాకు అతను 1983 నుంచి తెలుసు. మేము మంచి మిత్రులం. గత ఏడాది జులైలో బెంగళూరుకు వచ్చినప్పుడు ఆయన తన చేతికి ఉన్న వాచ్‌ను తీసి నా చేతికి తొడిగారు. నేను వద్దాన్నా వినలేదు. స్నేహితుడే కదా ఇచ్చింది అని నేను కూడా తీసుకున్నా. మొదట్లో నేను ఆ వాచ్‌ను వాడలేదు. నాలుగు నెలల నుంచి మాత్రమే వాచ్‌ను ధరిస్తున్నాను. ఈ వాచ్ పై ఇంత వివాదం చెలరేగింది. ఇక ఈ వాచ్‌ ను ధరించను. క్యాబినెట్ హాల్‌లో ఉంచేస్తాను.’ అని తెలిపారు. ఇదిలా ఉండగా సీఎం సిద్ధరామయ్య వివరణ పలు అనుమానాలకు తావిస్తోందని కుమారస్వామి అభిప్రాయపడ్డారు. వివరణ ఇవ్వడానికి పదిహేను రోజులు ఎందుకు తీసుకున్నట్టు అంటూ ప్రశ్నించారు.                               
 
>
మరిన్ని వార్తలు