‘హుద్‌హుద్’పై చర్చకు పట్టుబడతాం!

24 Nov, 2014 02:05 IST|Sakshi
‘హుద్‌హుద్’పై చర్చకు పట్టుబడతాం!
  • వైఎస్సార్సీపీ ఎంపీ మేకపాటి
  •  ‘విభజన’ హామీలను పార్లమెంటులో ప్రస్తావిస్తాం
  •  అఖిలపక్ష భేటీలో పార్టీ తరఫున హాజరు
  • సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరాంధ్రను కుదిపేసిన హుదుహుద్ తుపానుపై పార్లమెంట్‌లో చర్చించాలని తమ పార్టీ తరఫున పట్టుబడతామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలూ నెరవేర్చాలన్న అంశంపైనా చర్చిస్తామన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాల నిర్వహణపై ఆదివారం సాయంత్రం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్సీపీ తర ఫున మేకపాటి పాల్గొన్నారు.

    అనంతరం విజయ్‌చౌక్‌లో మీడియాతో మాట్లాడారు. ఆదర్శ గ్రామాల అభివృద్ధికి ఎంపీ లాడ్స్ నిధుల పెంపు, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర అంశాలను కూడా సభలో లేవనెత్తుతామని చెప్పారు. ‘హుద్‌హుద్ తుపాను విశాఖ, విజయనగరం, శ్రీశాకుళం జిల్లాలను చిన్నాభిన్నం చేసింది. పంటలు, తోటలు నాశనమయ్యాయి. తుపాను బాధితులను ఆదుకునేందుకు ప్రధానమంత్రి ప్రకటించిన రూ. 1,000 కోట్లలో రూ. 400 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి.

    మా పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో మేమంతా ఆర్థికశాఖ మంత్రి అరుణ్‌జైట్లీని, హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ని కలిసి అక్కడ జరిగిన నష్టాన్ని వివరిస్తూ వినతిపత్రాన్ని ఇచ్చాం. శుక్రవారం స్పీకర్  అధ్యక్షత జరిగిన అఖిలపక్ష సమావేశంలో కూడా తుపాను సాయం విషయాన్ని ప్రస్తావించాం’ అన్నారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలపై నిలదీస్తామన్నారు. ‘రాజధాని లేదు. అసెంబ్లీ భవనం, గవర్నర్ బంగళా, ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధుల నివాసాలెక్కడో తెలియదు.

    విభజన సమయంలో రాష్ట్రానికి కేంద్రం పలు హామీలిచ్చింది. ప్రత్యేక హోదా ఇస్తామన్నారు. రాష్ట్రానికి రూ. 16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంది. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చిన హామీలు అమలు చేయాలని, ప్రత్యేక హోదా ఇవ్వాలని, లోటు బడ్జెట్ పూడ్చడంతోపాటు ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలా ఆదుకోవాలని కోరతాం’ అని తెలిపారు. తెలంగాణకు సంబంధించి ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, వీలైనంత తర్వగా చేపట్టాలని కోరతామన్నారు. ఏపీలో పెండింగ్‌లోని రైల్వే ప్రాజెక్టులనూ సభ దృష్టికి తెస్తామన్నారు.
     

మరిన్ని వార్తలు