బాత్‌రూం గోడలో భోషాణం

11 Dec, 2016 01:55 IST|Sakshi
బాత్‌రూం గోడలో భోషాణం

రూ. 5.7 కోట్ల విలువైన 2 వేల నోట్లు,రూ. 90 లక్షల చిన్న నోట్లు స్వాధీనం
- 28 కిలోల బంగారు బిస్కెట్లు,4 కిలోల ఆభరణాలు కూడా
- కర్ణాటక ఐటీ దాడుల్లో వెలుగుచూసిన నల్లధనం


సాక్షి, బెంగళూరు: ఐటీ శాఖ వరుస దాడులతో నల్ల కుబేరుల పాపాల పుట్టలు ఒక్కొక్కటిగా పగులుతున్నాయి. బెడ్‌రూం, బాత్‌రూంలు.. ఎక్కడ నల్లధనం దాచినా గుట్టలు గుట్టలుగా వెలికితీస్తున్నారు. ఇటీవలే భారీగా నల్లధనాన్ని స్వాధీనం చేసుకున్న కర్ణాటక ఐటీ అధికారులు తాజాగా చిత్రదుర్గలోని ఒక ఇంటి బాత్‌రూం గోడ వెనుక రహస్యంగా దాచిన రూ. 6.6 కోట్ల నగదును సీజ్‌ చేశారు. పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి కర్ణాటకలోని బెంగళూరు, మంగళూరు, హుబ్లీ, చిత్రదుర్గ నగరాల్లో ఏకకాలంలో 15 చోట్ల ఐటీ అధికారులు సోదాలు చేశారు. చిత్రదుర్గ జిల్లా చల్లకెరెలో కన్నడ సినీనటుడు దొడ్డణ్ణ అల్లుడు వీరేంద్ర అలియాస్‌ పప్పి ఇంట్లో సోదాల్లో రూ.5.70 కోట్లు విలువ చేసే కొత్త రూ. రెండు వేల నోట్లు స్వాధీనం చేసుకున్నారు.

ఈ సొమ్మును బాత్‌రూం గోడలో రహస్యంగా ఏర్పాటు చేసిన చిన్నపాటి గదిలో స్టీల్‌ బాక్సుల్లో దాచి ఉంచారు. నగదుతో పాటు 28 కిలోల బంగారు బిస్కెట్లు, నాలుగు కిలోల బంగారు, వెండి ఆభరణాలు తనిఖీల్లో బయటపడ్డాయి. రూ. 90 లక్షల విలువ చేసే రూ. 100, రూ. 20 నోట్లనూ అధికారులు కనుగొన్నారు. వీరేంద్రకు రాష్ట్రంలో పలుచోట్ల రిక్రియేషన్‌ క్లబ్బులు ఉన్నాయి. దీంతో అక్కడ కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. వీరేంద్ర స్నేహితుడు, హవాలా వ్యాపారి సమందర్‌సింగ్‌ ఇంటితో పాటు, స్థానికంగా ఆయన బంధువులు, స్నేహితుల ఇళ్లలోనూ సోదాలు నిర్వహించగా... రూ. కోటి సొమ్ము బయట పడింది. ఇందులో నకిలీ నోట్లూ  ఉన్నట్లు సమాచారం. సమందర్‌సింగ్‌ క్రికెట్‌ బెట్టింగ్‌ దందా చేసేవాడని చెబుతున్నారు. వీరేంద్ర సోదరుడు తిప్పేస్వామి ఇంటిపై దాడి చేసిన అధికారులు బంగారు ఆభరణాలు, ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. శనివారం రాత్రి పొద్దుపోయే వరకూ సోదాలు కొనసాగాయి.

గోడకున్న రంధ్రంలో రహస్య తాళంతో తిప్పితే
వీరేంద్ర తన ఇంట్లో రహస్య భోషాణం ఏర్పాటు చేసుకున్నాడు. అందులో నగదు, బంగారం చూసి ఐటీ అధికారులే నోరెళ్లబెట్టారు. బాత్‌రూం గోడకు మధ్యలో ఎడమవైపున చిన్న రంధ్రం ఉంది.   ఆ రంధ్రంలో ప్రత్యేక లోహంతో తయారు చేసిన తాళాన్ని ఉంచి, ఎడమవైపునకు రెండు సార్లు తిప్పాలి. తర్వాత ఆ గోడకు కుడివైపున రెండు సార్లు బలంగా మోదితే సీక్రెట్‌ లాక్‌ తెరుచుకుంటుంది. ఆ రహస్య గదిని ఆంగ్లంలోని ఎల్‌ అక్షర ఆకారంలో నిర్మించారు.

>
మరిన్ని వార్తలు