ఆదాయం, ఆయుష్షు భేష్‌

16 Sep, 2018 02:22 IST|Sakshi

మానవాభివృద్ధిలో భారత్‌ ముందడుగు 

1990తో పోలిస్తే 11 ఏళ్లు పెరిగిన భారతీయుల ఆయుర్దాయం 

అదే కాలానికి 267 శాతం పెరిగిన తలసరి ఆదాయం 

ఐక్యరాజ్య సమితి హెచ్‌డీఐ నివేదికలో వెల్లడి  

అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న భారత్‌... మానవాభివృద్ధి సూచీ (హెచ్‌డీఐ)లోనూ ముందడుగు వేస్తోంది. వివిధ అంశాల్లో గతంతో పోలిస్తే తన స్థానాన్ని మరింత మెరుగుపరుచుకుంది. గత రెండున్నర దశాబ్దాల్లో హెచ్‌డీఐలో గణనీయమైన ప్రగతి సాధించింది. ఈ విషయాన్ని ఐక్యరాజ్యసమితి (ఐరాస) తన తాజా నివేదికలో వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం 1990లో భారత్‌ హెచ్‌డీఐ విలువ 0.427 ఉండగా 2017 నాటికది 0.640కు పెరిగింది. అలాగే అదే కాలానికి భారతీయుల ఆయుర్దాయం 11 ఏళ్లు మెరుగుపడింది. తలసరి ఆదాయం కూడా గణనీయంగా పెరిగింది. అయితే లింగ సమానత్వం మాత్రం ఆందోళనకరంగా ఉందని నివేదిక తెలిపింది. 

ఆరోగ్యం, విద్యల్లో పురోగతి... 
స్థూల జాతీయ తలసరి ఆదాయం ఆధారంగా జీవన ప్రమాణాన్ని, ఆయుర్దాయం ఆధారంగా ఆరోగ్యాన్ని, పాఠశాల విద్య ఆధారంగా విద్య స్థాయిని అంచనా వేసి ఐక్యరాజ్యసమితి హెచ్‌డీఐ నివేదిక రూపొందిస్తుంది. ఈ మూడు అంశాల్లో ఆయా దేశాలు సాధించిన ప్రగతి ఆధారంగా వాటికి 0 నుంచి 1 వరకు పాయింట్లు ఇస్తుంది. ఆ పాయింట్లను బట్టి ఆ దేశం ఎన్నో స్థానంలో ఉందో నిర్ణయిస్తుంది. 1990 నుంచి చూసుకుంటే ఈ మూడు అంశాల్లోనూ భారత్‌ మంచి పురోగతినే సాధించిందని ఐరాస పేర్కొంది. దాదాపు 50 శాతం వృద్ధి నమోదు చేసిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఆయుర్దాయం పెరగడం, ఎక్కువ మంది చదువుకోవడం, తలసరి ఆదాయం పెరగడం వంటి కారణాల వల్ల ప్రపంచవ్యాప్తంగా హెచ్‌డీఐ విలువ 22 శాతం పెరిగింది. అలాగే తలసరి ఆదాయం ఈ 27 ఏళ్లలో ఏకంగా 266 శాతం పెరిగింది. హెచ్‌డీఐ విలువ తక్కువ ఉన్న దేశాల్లో పిల్లలు 60 ఏళ్లు జీవిస్తారని అంచనా వేయగా అధిక హెచ్‌డీఐ ఉన్న దేశాల్లో పిల్లలు 80 ఏళ్ల వరకు జీవించే అవకాశం ఉందని నివేదిక తెలిపింది. 

ఆదాయంలో 267 శాతం పెరుగుదల... 
తలసరి ఆదాయంలో సైతం భారత్‌ దక్షిణాసియాలోని పొరుగు దేశాలతో పోల్చుకుంటే చెప్పుకోతగ్గ స్థాయిలో అభివృద్ధి చెందింది. 1990లో మన తలసరి ఆదాయం రూ. 1,24,957కాగా 2017 నాటికి 267 శాతం పెరిగి రూ. 4,58,083కు చేరుకుంది. 

లింగ సమానత్వంలో పరిస్థితి ఆందోళనకరం... 
అన్ని విషయాల్లో ముందంజలో ఉన్నా లింగ సమానత్వం విషయంలో మాత్రం భారత్‌ ఇంకా సాధించాల్సింది చాలా ఉందని యూఎన్‌డీపీ ఇండియా కంట్రీ డైరెక్టర్‌ ఫ్రాన్సిన్‌ పికప్‌ అన్నారు. విద్య, ఆరోగ్యం, ఆదాయం విషయాల్లో భారత్‌లో లైంగిక అసమానత కొనసాగుతోందని, ఇది దేశాభివృద్ధిపై దుష్ప్రభావం చూపుతోందని ఆయన అన్నారు. ఈ విషయంలో అంతర్జాతీయ సగటు కంటే భారత్‌ సగటు 26.8 శాతం తక్కువ ఉందని నివేదిక స్పష్టం చేసింది. లింగ సమానత్వ సూచీలో భారత్‌ 160 దేశాల్లో 127వ స్థానంలో ఉంది. విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో భారతీయ మహిళల భాగస్వామ్యం పురుషులతో పోలిస్తే నామమాత్రంగా ఉందని యూఎన్‌డీపీ నివేదిక తెలిపింది. పార్లమెంటులో కేవలం 11.6 శాతం మంది మాత్రమే మహిళలు ఉన్నారు. మాధ్యమిక విద్య వరకు చదివిన వారిలో పురుషులు 64 శాతం ఉండగా మహిళలు 39 శాతమే ఉన్నారు. ఇక శ్రామికశక్తిలో మహిళల వాటా 27.2 శాతంకాగా పురుషులు 78.8 శాతం మంది ఉన్నారు. అంతర్జాతీయంగా శ్రామికశక్తిలో మహిళల వాటా 49 శాతంకాగా, పురుషుల వాటా 75 శాతంగా ఉంది. అభివృద్ధికి కీలకమైన విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచడంపై భారత్‌ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఫ్రాన్సిన్‌ అభిప్రాయపడ్డారు. 

మన ఆయుష్షు పెరిగింది 
భారతీయులు గతంకంటే ఎక్కువ కాలం జీవిస్తున్నట్టు ఐక్యరాజ్యసమితి మానవాభివృద్ధి సూచీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఆయుర్దాయంలో 1990 కంటే మెరుగైన ఫలితాలను ఐక్యరాజ్య సమితి హ్యూమన్‌ డెవలప్‌మెంట్‌ ఇండెక్స్‌ భారత్‌లో గుర్తించింది. 1990లో భారతీయుల ఆయుఃప్రమాణం కేవలం 57.9 సంవత్సరాలే ఉండగా 2017 మానవాభివృద్ధి సూచీలో భారతీయుల ఆయుఃప్రమాణం ఏకంగా 11 ఏళ్లు పెరిగి దాదాపు 70 ఏళ్లకు చేరువవుతోంది. ప్రస్తుతం మన భారతీయుల ఆయుఃప్రమాణం 68.8 ఏళ్లు. భారతీయులకంటే బంగ్లాదేశీయుల ఆయుఃప్రమాణం అధికంగా నమోదైంది. మన దేశస్తులు దాదాపు 69 ఏళ్లు జీవిస్తుంటే, బంగ్లాదేశీయులు సగటు జీవిత కాలం 73 ఏళ్లు. 

స్త్రీల ఆయుఃప్రమాణం...
భారతదేశంలో    70.4 ఏళ్లు
బంగ్లాదేశ్‌లో    74.6 ఏళ్లు 
పాకిస్తాన్‌లో    67.7 ఏళ్లు 

పురుషుల ఆయుఃప్రమాణం...
భారతదేశంలో    67.3 ఏళ్లు 
బంగ్లాదేశ్‌లో    71.2ఏళ్లు 
పాకిస్తాన్‌లో    65.6 ఏళ్లు

మరిన్ని వార్తలు