హక్కుల ఉల్లంఘనలను సహించబోం

6 Jul, 2018 03:57 IST|Sakshi

న్యూఢిల్లీ: మానవ హక్కుల ఉల్లంఘనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. ఇటువంటి ఘటనలను సహించేది లేదని స్పష్టం చేసింది. మణిపూర్‌లో సైన్యం, అస్సాం రైఫిల్స్, పోలీసు బలగాలు పాల్పడిన నాలుగు నకిలీ ఎన్‌కౌంటర్లపై ఈ నెల 27లోగా తుది నివేదిక ఇవ్వాలని సీబీఐను ఆదేశించింది. ఈ ఎన్‌కౌంటర్లలో పౌరులు ప్రాణాలు కోల్పోయినందున తీవ్ర ప్రాముఖ్యత గల విషయంగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్, జస్టిస్‌ యుయు లలిత్‌ల బెంచ్‌ గురువారం ఈ కేసు విచారణ చేపట్టింది.

తమ విచారణ పూర్తయిందని, తుది నివేదిక రూపొందించే పనిలో ఉన్నామని సీబీఐ ప్రత్యేక విచారణ బృందం(సిట్‌) కోర్టుకు తెలిపింది. దీంతోపాటు మణిపూర్‌లో జరిగిన 41 ఎన్‌కౌంటర్లపై సిట్‌ దర్యాప్తు కొనసాగుతోందనీ, ఇప్పటివరకు 20 కేసుల్లో దర్యాప్తు పూర్తికావొచ్చిందని అదనపు సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) మణీందర్‌ సింగ్‌ తెలిపారు. స్పందించిన న్యాయస్థానం ‘మానవ హక్కుల ఉల్లంఘన గురించి మాత్రమే కాదు, మరణాలను కూడా పరిగణనలోకి తీసుకుంటున్నాం. అవి హత్యలా? కాదా? మానవ హక్కుల కంటే ఈ అంశానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నాం’ అని పేర్కొంది. 

మరిన్ని వార్తలు