బిగ్‌ బాస్‌కి నో చెప్పేశాడు

9 Jun, 2018 12:49 IST|Sakshi
వాహనానికి ఫరూక్ అహ్మద్ దార్ ను కట్టేసిన దృశ్యం.. పక్కన తల్లితో దార్‌

సాక్షి, ముంబై/శ్రీనగర్‌: జమ్ము కశ్మీర్‌లో గతేడాది ఓ వీడియో సంచలనం సృష్టించింది. రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు ఓ వ్యక్తిని కవచంగా మార్చుకున్న సైన్యం.. అల్లరిమూకపై ఎదురుదాడి చేసింది. బుద్గాం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన అప్పట్లో అంతర్జాతీయ, జాతీయ మీడియాల దృష్టిని ఆకర్షించింది. కాగా రాళ్లదాడికి పాల్పడే వ్యక్తిగా ఫరూక్ అహ్మద్ దార్ (29) సైన్యం ముద్రవేయడంతో ప్రభుత్వం అతనికి అండగా నిలువడం లేదు. మరోవైపు సైన్యానికి సహకరించాడంటూ గ్రామస్థులు కూడా సామాజికంగా బహిష్కరించారు. దీంతో జీవనోపాధి కరువై దార్‌ కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.

ఈ నేపథ్యంలో హిందీ బిగ్‌ బాస్‌ నిర్వాహకులు అతనికి పెద్ద మొత్తంలో సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే అతను ఆ సాయాన్ని సున్నితంగా తిరస్కరించినట్లు తెలుస్తోంది. ‘ఓ రోజు బిగ్‌ బాస్‌ నిర్మాత ఒకరు నాకు ఫోన్‌ చేశారు. రూ. 50 లక్షల చెక్కు ఇస్తామని, మీ కోసం టికెట్లు సిద్ధం చేశామని చెప్పారు. నేను వద్దని స్పష్టం చేశాను. అయినా ఫర్వాలేదు మీకోసం మేం సాయం చేసేందుకు ఎప్పుడైనా సిద్ధంగా ఉంటామని ఆయన నాతో అన్నారు’ అని దార్‌ ఓ జాతీయ మీడియా ఛానెల్‌కు వెల్లడించాడు. అయితే బిగ్‌బాస్‌ నిర్వాహకులు మానవతా కోణంలోనే అతనికి సాయం చేసేందుకు ముందుకొచ్చారని దార్‌ తరపు న్యాయవాది అహ్సన్‌ వుంటూ తెలిపారు. కాగా, బిగ్‌బాస్‌ నిర్వాహకులు మాత్రం ఈ విషయంపై ఇంకా స్పందించలేదు. 

శ్రీనగర్ లోక్‌సభ ఉపఎన్నికల సందర్భంగా గత ఏడాది ఏప్రిల్ 9న ఎన్నికలను బహిష్కరించాలని వేర్పాటువాదులు పిలుపునిచ్చారు. అయితే వేర్పాటువాదుల హెచ్చరికలను లెక్కచేయకుండా దార్ తన ఓటు హక్కును ఉపయోగించుకోవడానికి వెళ్లాడు. అదే సమయంలో అల్లరిమూక రాళ్లదాడికి పాల్పడింది. తమ బలం తక్కువగా ఉండటంతో వారి నుంచి తప్పించుకునేందుకు దార్‌ను ఓ జీప్‌ కు కట్టేసి మేజర్ లీతుల్ గొగోయ్ నేతృత్వంలోని సైన్య బృందం ప‍్రతిఘటించింది. ఆ ఘటన తర్వాతే దార్‌ జీవితం మలుపు తిరిగింది. ఎంబ్రాయిడరీ దుస్తుల నిపుణుడైన దార్‌కు.. కూలీ పని కూడా దొరకని పరిస్థితి నెలకొంది. చివరకు అహ్మద్ దార్‌కు రూ.10 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని జమ్ము-కశ్మీరు మానవ హక్కుల కమిషన్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే ఆ ఆదేశాలను మాత్రం ప్రభుత్వం తిరస్కరించింది. దీంతో దార్‌ న్యాయపోరాటం కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు