10 శాతం రిజర్వేషన్లపై అయోమయం

22 Jun, 2019 17:50 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ఆర్థికంగా వెనకబడిన అగ్రవర్ణాల పిల్లలకు విద్యా, ఉద్యోగావకాశాల్లో పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ నరేంద్ర మోదీ ప్రభుత్వం గత లోక్‌సభ ఎన్నికలకు రెండు నెలల ముందు, జనవరి నెలలో రాజ్యాంగ సవరణ బిల్లును తీసుకొచ్చిన విషయం తెల్సిందే. ఎస్సీ,ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను కోత పెట్టకుండా, అగ్రవర్ణాల విద్యార్థులకు విద్యా సంస్థల్లో అడ్మిషన్లు ఇవ్వాలంటే ప్రస్తుతం ఉన్న సీట్లకన్నా 25 శాతం సీట్లను పెంచాలని, ఆ మేరకు తరగతి గదులను, సిబ్బందిని పెంచాలని పలు విద్యా సంస్థలు ప్రభుత్వాలకు ప్రతిపాదనలు పంపించాయి. ఆ దిశగా ఇంతవరకు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో విద్యా సంస్థల అధ్యాపకులు, ఈ కేటగిరీ కింద అడ్మిషన్లు కోరుతున్న విద్యార్థినీ విద్యార్థులు గందరగోళంలో పడుతున్నారు. 

గుంజాన్‌ మఖిజాని అనే 18 ఏళ్ల యువతి జర్నలిజం కోర్సులో చేరేందుకు ఢిల్లీ యూనివర్శిటీలోని హెల్ప్‌ డెస్క్‌ను ఆశ్రయించారు. తాను ఏడాదికి ఎనిమిది లక్షల రూపాయల ఆదాయం కలిగి ఆర్థికంగా వెనకబడిన వర్గం కింద పది శాతం రిజర్వేషన్ల పరిధిలోకి వస్తానని చెప్పారు. అయితే సబ్‌–డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ నుంచి ఆదాయం సర్టిఫికెట్‌ తీసుకరావాలని యూనివర్శిటీ వారు సూచించారు. దాంతో ఆమె అయోమయంలో పడ్డారు. సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ నుంచి ఆదాయం సర్టిఫికెట్‌ తీసుకరావడం ఆమెకెకాదు చాలా మంది విద్యార్థులకు కష్టం. ఇదే విషయమై సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ను ప్రశ్నించగా, ఆదాయ పత్రాలను జారీ చేయాల్సిందిగా తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లే వని అన్నారు. పది శాతం రిజర్వేషన్లను ఎలా అమలు చేయాలో తమకు మార్గదర్శకాలేవీ లేవని రాజస్థాన్‌లో ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఆదాయ, ఆస్తుల సర్టిఫికెట్లను చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తోందని ఉత్తరప్రదేశ్‌లో విద్యార్థులు వాపోతున్నారు. 

మరిన్ని వార్తలు