మాట వినని భార్య.. చివరికి 71 గొర్రెలు తీసుకుని..

18 Aug, 2019 11:48 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

లక్నో: మూఢ విశ్వాసాలు, ఆచారాలతో వార్తల్లో నిలిచే ఉత్తరప్రదేశ్‌లో తాజాగా మరో ఘటన వెలుగుచూసింది. ప్రియుడితో కలిసి పారిపోయిన భార్యను వదులుకోవడానికి ఓ భర్తకు 71 గొర్రెలు నష్టపరిహారంగా ఇవ్వాలని అక్కడి పంచాయతీ ఒకటి విచిత్రమైన తీర్పునిచ్చింది. యువతి భర్తకు 71 గొర్రెలు ఇవ్వాలంటూ పంచాయతీ పెద్దలు ప్రియుడిని ఆదేశించారు. ఈ ఘటన గోరక్‌పూర్‌ జిల్లాలో జూలై 22న జరిగింది. అయితే, ఈ తీర్పు నచ్చని  ప్రియుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

వివరాలు..  గోరఖ్‌పూర్‌ జిల్లాలోని చార్ఫాణి గ్రామంలో రాజేష్‌ పాల్‌ , సీమా పాల్‌ (25) భార్యాభర్తలు. అదే గ్రామానికి చెందిన ఉమేష్‌ (27)తో సీమా వివాహేతర సంబంధం బయటపడటంతో గ్రామ పెద్దల సమక్షంలో గత నెలలో పంచాయతీ జరిగింది. భర్తతో కలిసి జీవించేందుకు సీమా ససేమిరా అంది. ఉమేష్‌తోనే ఉంటానని స్పష్టం చేసింది. దీంతో భర్త రాజేష్‌ పాల్‌కు నష్ట పరిహారం ఇవ్వాల్సిందిగా ఆమె ప్రియుడు ఉమేష్‌ని పంచాయితీ ఆదేశించింది. అతనికి ఉన్న 142 గొర్రెల్లో సగం ఇవ్వాలని పెద్ద మనుషులు తీర్పునిచ్చారు.

దీనికి సీమా భర్త కూడా అంగీకరించడంతో వివాదం అంతటితో ముగిసింది. ఇది జరిగి మూడు వారాలు కావొస్తోంది. అయితే, ఉమేష్‌ తండ్రి గ్రామ పెద్దల తీర్పుపై అసహనం వ్యక్తం చేశాడు. తన గొర్రెలు తిరిగి ఇప్పించాలంటూ పోలీస్‌ స్టేషన్‌ మెట్లెక్కాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గొర్రెలు ఉమేష్‌ స్వార్జితమే అయితే కేసులో తాము చేసేదేం ఉండదని గోరఖ్‌పూర్‌ ఎస్‌ఎస్పీ సునీల్‌ కుమార్‌ గుప్తా చెప్పారు. ఇక భార్యభర్తల పంచాయతీలో సీమా భర్త ఎలాంటి ఫిర్యాదు చేయనందున జోక్యం చేసుకోలేమని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు