భర్తల కోసం భార్యల పరస్పర కిడ్నీ దానం

8 Sep, 2014 01:29 IST|Sakshi
భర్తల కోసం భార్యల పరస్పర కిడ్నీ దానం

న్యూఢిల్లీ: మూత్రపిండాల వ్యాధి కారణంగా మృత్యువుకు చేరువైన తమ భర్తలను కాపాడుకునేందుకు ఇద్దరు భార్యలు పరస్పరం కిడ్నీదానం చేశారు. దీంతో వారి భర్తలకు పరస్పర కిడ్నీ మార్పిడి ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో విజయవంతంగా జరిగింది. బొకారోలోని సెయిల్ కంపెనీలో ఇంజనీర్‌గా పనిచేస్తున్న ఎస్‌బీ రామ్(61), ఎన్‌డీఎంసీకి చెందిన సీనియర్ అధికారి శాంత్ రామ్(58)లు రెండేళ్ల నుంచి తీవ్రమైన కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్నారు.

కుటుంబసభ్యుల మూత్రపిండాలు మార్పిడి చేసేందుకు వీలుకాకపోవడం, తగిన దాతలు కూడా దొరకకపోవడంతో రెండేళ్లుగా వారు డయాలసిస్ చేయించుకుంటూ వస్తున్నారు. దీంతో ఢిల్లీలోని బీఎల్‌కే హాస్పిటల్ వైద్యులు ఎస్‌బీ రామ్, శాంత్ రామ్ భార్యలు ఊర్మిళ, గంగాదేవీలను కలిపి పరిస్థితిని వివరించారు. వారిద్దరూ పరస్పర కిడ్నీదానానికి అంగీకరించడంతో ఒకరి కిడ్నీని మరొకరి భర్తకు ఇటీవల విజయవంతంగా అమర్చారు. వీరిలాగే అందరూ ‘పరస్పర కిడ్నీ మార్పిడి’ పద్ధతికి ముందుకు వస్తే ఎంతో మంది ప్రాణాలను కాపాడొచ్చని వైద్యులు సూచించారు.
 

మరిన్ని వార్తలు