పాక్ భర్త నుంచి విడిపించాలి..

16 Mar, 2017 17:30 IST|Sakshi
పాక్ భర్త నుంచి విడిపించాలి..
హైదరాబాద్‌: భర్త పెట్టే హింసను భరిస్తూ పాకిస్తాన్‌లో నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన ఓ మహిళను స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌ పాక్‌లోని భారత హైకమిషనర్‌ గౌతం బొంబావాలాను కోరారు. గురువారం ఈ విషయాన్ని ఆమె ట్విట్టర్‌లో వెల్లడించారు. నగరంలోని బండ్లగూడకు చెందిన మహమ్మది బేగం(44)కు లాహోర్‌కు చెందిన మహ్మద్‌ యూనిస్‌(60)తో 1996లో వివాహమయింది. తను పాకిస్తాన్‌ వాసి అనే విషయాన్ని దాచిపెట్టి..ఒమన్‌ దేశస్థుడి నంటూ పెళ్లి ఫోన్‌ ద్వారా నిఖా చేసుకున్నాడు. అనంతరం వారు మస్కట్‌లో కాపురం పెట్టారు. మెకానిక్‌గా పనిచేసే యూనిస్‌ ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు కలిగాక తాను పాకిస్తాన్ పౌరుడిననే అసలు నిజాన్ని వెల్లడించాడు.
 
అప్పటికే అతడి ఉద్యోగం పోవడంతో లాహోర్‌కు మకాం మార్చాడు. భార్యను తీవ్ర హింసకు గురిచేస్తున్న యూనిస్‌, ఆమె ఇండియా పాస్‌పోర్టును కూడా రెన్యువల్‌ చేయించలేదు. ఆమె హైదరాబాద్‌లోని పుట్టింటికి 2012లో వచ్చి వెళ్లింది. ఈ నేపథ్యంలోనే ఆమె తండ్రికి ఫోన్‌ చేసి తనను భర్త చెర నుంచి విడిపించాలని వేడుకుంది. ఆమె తండ్రి మహ్మద్‌ అక్బర్‌ స్థానికంగా సైకిల్‌ మెకానిక్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఆయన తన కుమార్తె పడుతున్న కష్టాలపై ఈ ఏడాది జనవరిలో కేంద్రమంత్రి సుష్మాస్వరాజ్‌కు ఒక మెయిల్‌ పంపారు. ఇదే విషయాన్ని స్థానిక ఎంబీటీ నాయకుడు అంజదుల్లాఖాన్‌ ఖలిద్‌ కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన సుష్మా భారత హైకమిషన్‌ అధికారులతో మాట్లాడారు. మహమ్మది బేగంను రక్షించేందుకు చర్యలు తీసుకోవాలని  కోరారు.
>
మరిన్ని వార్తలు