హైదరాబాద్‌ కుర్రాడు.. కుంభస్థలాన్ని కొట్టాడు..!

30 Oct, 2017 09:27 IST|Sakshi

న్యూఢిల్లీ : చక్రధర్‌ ఆళ్ల ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ విద్యార్థి పేరు మారు మోగిపోతోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు చక్రధర్‌ రూపొందించిన లోగోను వినియోగించనుంది. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టు(నేషనల్‌ హైస్పీడ్‌ రైల్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌) లోగో కోసం కేంద్ర ప్రభుత్వం mygov.inలో ఆహ్వానాలను పిలిచింది.

దీంతో అహ్మదాబాద్‌ నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌లో చదువుకుంటున్న చక్రధర్‌ కూడా తాను తయారు చేసిన లోగోను ప్రభుత్వానికి పంపారు. ఇలా మైగావ్‌ నిర్వహించే పోటీల్లో పాల్గొనడం చక్రధర్‌కు ఇది తొలిసారేమీ కాదు. ఇప్పటివరకూ నరేంద్ర మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన 31 పోటీల్లో పాల్గొన్నారు చక్రి. 30 ప్రయత్నాల్లో అదృష్టం కలిసిరాలేదు. నిరాశ చెందక.. 31వ సారి కూడా ప్రయత్నించారు. బుల్లెట్‌ ట్రైన్‌ ప్రాజెక్టుకు చిరుతపులి పరుగెడుతున్నట్లు రూపొందించిన లోగోను ఎంట్రీగా మైగావ్‌లో అప్‌లోడ్‌ చేశారు.

వేలాదిగా వచ్చిన ఎంట్రీల నుంచి బుల్లెట్‌ ట్రైన్‌ లోగోగా చక్రధర్‌ రూపొందించిన లోగోను ప్రభుత్వం ఎంపిక చేసింది. బుల్లెట్‌ ట్రైన్‌ లోగోగా తన డిజైన్‌ ఎంపిక కావడంపై స్పందించిన చక్రధర్‌.. తాను చేసిన చాలా ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పారు. బుల్లెట్‌ ట్రైన్‌కు తన లోగో ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని అన్నారు.

డిజైన్‌ చూడటానికి సింపుల్‌గా కనిపించినా దాని వెనుక అంతరార్థం చాలా ఉందని చెప్పారు. చిరుత వేగానికి ప్రతీక కాగా, దానిపై ఉన్న రైలు ఆకారం నమ్మకానికి(వేగం+నమ్మకం) నిదర్శనమని వెల్లడించారు. చక్రధర్‌ సొంత ఊరు హైదరాబాద్‌. తండ్రి ప్రభుత్వ ఉద్యోగిగా పని చేస్తుండగా.. తల్లి ఓ స్కూల్‌లో ప్రిన్సిపల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. లోగోలు తయారుచేయడంలో తనకు ఉన్న అమితాసక్తి కారణంగా స్నేహితులు, కుటుంబ సభ్యులు తనను ‘లోగోమ్యాన్‌’గా పిలుస్తుంటారని చక్రధర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు