తేలియాడే వ్యవసాయం

14 Jul, 2019 04:35 IST|Sakshi
ఫ్లోటింగ్‌ వ్యవసాయంలో వరిసాగు

కష్టాల నుంచి గట్టెక్కేందుకు ఫ్లోటింగ్‌ వ్యవసాయం బాటపట్టిన మజూలి ద్వీపవాసులు

ఏడాది పొడవునా వరదలు. ఎటు చూసినా నీళ్లే. ప్రపంచంలోనే అతిపెద్ద నదీ ‘ద్వీప’మది. మరి పంటలు పండేదెలా, కడుపు నిండేదెలా? అస్సాంలో బ్రహ్మపుత్ర నది తీర ప్రాంతంలోని మజూలి ద్వీపవాసులు ఎప్పట్నుంచో ఎదుర్కొంటున్న సమస్య ఇది. ఇప్పుడా సమస్య నీటి మబ్బులా తేలిపోయింది. హైడ్రోపానిక్‌ వ్యవసాయం అంటే తెలుసు కదా, అపార్ట్‌మెంట్‌ కల్చర్‌ పెరిగిపోతున్న నగరాల్లో ఈ కొత్త తరహా వ్యవసాయం అందుబాటులోకి వచ్చింది. మట్టి అవసరం లేకుండా ఎంచక్కా మన రోజువారీ అవసరానికి తగ్గ కూరలు బాల్కనీల్లోనే పండించుకోవచ్చు. కానీ అది కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. మజూలిలో అధికార యంత్రాం గం తమ బుర్రలకు మరింత పదునుపెట్టారు. హైడ్రోపానిక్‌ వ్యవసాయానికే మరింత మెరుగులు దిద్దారు. ఇంకా సహజపద్ధతుల్లో, తక్కువ ఖర్చుతో, స్థానికంగా దొరికే వనరులతో నీళ్లల్లో తేలియాడే వ్యవసాయ పద్ధతుల్లో పంటలు పండిస్తున్నారు. దీంతో ఉపాధికి ఉపాధి, ఆదాయానికి ఆదాయం.  

హైడ్రోపానిక్‌ సాగు అంటే?  
8 అడుగులు పొడవు, 8 అడుగుల వెడల్పులో వెదురు బొంగులతో వ్యవసాయానికి అవసరమయ్యే హైడ్రోపానిక్‌ ట్రేని రూపొందించి అందులో విత్తనాలు వేస్తారు. మట్టిలో ఉండే పోషకాలన్నీ ఆ నీటిలో కలుపుతారు. మొక్కలు ఎదగడానికి వర్మీ కంపోజ్డ్‌ నీళ్లను జల్లుతారు. ట్రేలన్నీ వెదురుబొంగులతో చేసినవి కావడంతో అవి నీళ్లలో తేలుతూ ఉంటాయి. వరదలు ముంచెత్తినా పంట నీటిపాలవుతుందన్న భయం లేదు. ‘మాకున్న కాస్తో కూస్తో వ్యవసాయ భూమి నీళ్లల్లో మునిగిపోయింది. ఏం చేయాలో తెలీని స్థితి. అప్పుడే ఫ్లోటింగ్‌ వ్యవసాయం గురించి తెలిసింది. వర్షాలు కురిస్తే పంటలు నీట మునుగుతాయన్న బాధ లేదు. ఆ ట్రేలన్నీ హాయిగా నీళ్లల్లో తేలుతూ పచ్చగా కనువిందు చేస్తుంటాయి. ఇక మా బతుకులూ పచ్చగానే ఉన్నాయి‘ అని పవిత్ర హజారికా అనే రైతు చెప్పారు.  
ఎందుకీ అవసరం వచ్చింది?
బ్రహ్మపుత్ర నదీ తీర ప్రాంతంలో ఉన్న మజూలిలో భూ ప్రాంతం ఏడాదికేడాది నీళ్లల్లో కలిసిపోతోంది. 1250 చదరపు కి.మీ.లు ఉన్న ఈ ప్రాంతంలో 75శాతం భూమిని నీరు ఆక్రమించేసింది. దీంతో అక్కడ నివాసం ఉండే 2 లక్షల మంది స్థానికుల భవితవ్యంపై నీలినీడలు కమ్ముకున్నాయి. 2016లో స్థానిక అధికారులు అక్కడ రైతులకు ఈ హైడ్రోపానిక్‌ వ్యవసాయాన్ని పరిచయం చేశారు. మొదట్లో రైతులకు ఈ వ్యవసాయమేంటో అర్థం కాలేదు. మట్టి లేకుండా మొక్కలు ఎలా పెరుగుతాయా? అని ఆశ్చర్యపోయారు. కానీ అవసరం వాళ్లకి అన్నీ నేర్పించింది. ‘ఈ పద్ధతుల్ని అవగాహన చేసుకోవడానికి రైతులకు కొన్నాళ్లు పట్టింది. ప్రస్తుతం 620 మందిపైగా రైతులు 528 హైడ్రోపానిక్‌ ట్రేలలో వ్యవసాయం చేస్తున్నారు. వరి, బంగాళాదుంపలు, కంద, కూరగాయలు, మూలికలు, మిరప, కొత్తిమీర, పుదీనా, కేబేజీ పంటలు పండిస్తున్నారు.

రైతులకు కాసుల పంట..
సంప్రదాయ వ్యవసాయంతో పోల్చి చూస్తే 3.58 రెట్లు అధికంగా లాభాలు వస్తున్నాయి. మొత్తం 10 ట్రేలలో 25 కేజీల వరకు పంట వస్తుంది. కూరగాయలు, ఆకుకూరల పంటలకు 2,500 రూపాయలు ఖర్చు అయితే 5 వేలవరకు తిరిగి వస్తుంది. అదే మూలికలు పెంచితే రూ.40 వేల వరకు ఆదాయం వస్తుందని ఈ ఫ్లోటింగ్‌ వ్యవసాయానికి మద్దతునిస్తున్న సౌత్‌ ఏషియా ఫోరమ్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంస్థ చైర్‌పర్సస్‌ దీపాయన్‌ దేవ్‌ చెప్పారు. రాష్ట్ర సీఎం సోనోవాల్‌ సొంత నియోజకవర్గం మజూలీ కావడంతో ఇక్కడ ఈ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నారు. త్వరలోనే ఈ జిల్లా కాలుష్యరహిత జిల్లాగా మారనుంది.


వెదురుకర్రల ట్రేలో సాగు

మరిన్ని వార్తలు