నేను జయలలిత కూతురిని

30 Aug, 2017 07:26 IST|Sakshi
నేను జయలలిత కూతురిని

శోభన్‌బాబు, జయ ప్రేమకు చిహ్నంగా జన్మించాను: అమృత
సాక్షి, బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత తన కన్నతల్లి అని బెంగళూరుకు చెందిన అమృత అనే మహిళ సంచలన ప్రకటన చేసింది. కూతురినని నిరూపించుకునేందుకు డీఎన్‌ఏ పరీక్షలకు సైతం తాను సిద్ధమని ప్రకటించింది. మరోవైపు, జయలలితది సహజ మరణం కాదని, నిజాలను రాబట్టేందుకు సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కోరుతూ ప్రధాని మోదీ, రాష్ట్రపతి కోవింద్‌ తదితరులకు ఆమె రాసిన లేఖలు మంగళవారం వెలుగుచూశాయి. సదరు లేఖలో ఉన్న సారాంశం క్లుప్తంగా... ‘జయలలిత నా కన్నతల్లి.

ఆమె తన అమ్మానాన్నలను కోల్పోయి మానసికంగా కుంగిపోయిన దశలో అలనాటి తెలుగు సినీ హీరో శోభన్‌బాబు సహచర్యంతో కోలుకుంది. ఆ సమయంలో వారిద్దరి ప్రేమకు గుర్తుగా నేను పుట్టాను. సామాజిక కట్టుబాట్ల కారణంగా వీరి వివాహం జరగలేదు. బెంగళూరులో ఉంటున్న జయ సోదరి శైలజ, భర్త సారథిలకు నన్ను అప్పగించారు. తన కుమార్తెననే విషయం చెప్పొద్దని వారితో జయ ఒట్టు వేయించుకున్నారు. 1996లో జయను కలవాల్సిందిగా శైలజ నాకు సూచించారు.

కలిసినపుడు నన్ను చూడగానే జయ నా వివరాలు కనుక్కొని ఆప్యాయతతో ఆలింగనం చేసుకున్నారు. తర్వాతా అనేకసార్లు కలిశా. నేనే నీ తల్లినని ఆమె నాతో ఎన్నడూ అనలేదు. జయ మరణం తర్వాత దీప, దీపక్‌లు ఆమె ఆస్తులకు వారసులమని చెబుతున్నట్లు మీడియాలో వచ్చిన వార్తలను చూసి.. అమెరికాలో ఉన్న మా బంధువైన జయలక్ష్మి నాకు ఫోన్‌ చేసి జయ సంతానం నేనే అని చెప్పారు. బెంగళూరులో ఉంటున్న మరో బంధువు సైతం ఇదే మాట చెప్పారు. నా తల్లిని కొంతమంది కుట్రచేసి చంపారు. వారిలో అన్నాడీఎంకే నాయకురాలు శశికళ, నటరాజన్‌లు ముఖ్యులు’ అని లేఖలో రాశారు.

మరిన్ని వార్తలు