మీ ప్రధాన సేవకుడిని

16 Aug, 2014 01:14 IST|Sakshi
మీ ప్రధాన సేవకుడిని
  • స్వాతంత్య్ర దిన వేడుకల్లో నరేంద్రమోడీ ప్రకటన 
  • ప్రణాళికాసంఘాన్ని రద్దు చేస్తాం.. సరికొత్త వ్యవస్థను నెలకొల్పుతాం
  • పేదలకు ‘జన ధన యోజన’ పథకంతో బ్యాంకు ఖాతాలు తెరిపిస్తాం
  • ఎంపీల ద్వారా ‘ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ పథకం’ అమలుచేస్తాం
  • యువత నైపుణ్యాల కోసం ‘స్కిల్ ఇండియా’ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం
  • పరిశుభ్రమైన భారత్ కోసం అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛ భారత్’ పథకం
  • తొలి ఏడాది పాఠశాలల్లో బాలబాలికలకు వేర్వేరు మరుగుదొడ్ల నిర్మాణం
  • మతం, కులం ప్రాతిపదికగా హింస ఇంకెన్నాళ్లు? పదేళ్ల పాటు వదిలేద్దాం
  • ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే దాన్ని నాణ్యతకు మారుపేరుగా నిలపాలి
  • పౌరులను సాధికారం చేయడానికి ‘డిజిటల్ ఇండియా’ను రూపొందిస్తాం
  • ప్రభుత్వంలో శాఖల మధ్య అంతరాలనే గోడలు బద్దలుకొడుతున్నా
  • పార్లమెంటులో సంఖ్యా బలంతో కాదు.. ఏకాభిప్రాయంతో నడిపిస్తాం 
  • జాతీయ పతాకావిష్కరణ అనంతరం మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగం
  •  
     నేను ప్రధానమంత్రిని కాను. ప్రధాన సేవకుడిగా మీ మధ్యకు వచ్చాను. పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రభుత్వాన్ని తెచ్చాను. పార్లమెంటులో సంఖ్యా బలంతో కాకుండా  ఏకాభిప్రాయంతో దేశాన్ని నడిపిస్తాను.. ప్రతిపక్షాన్ని కలుపుకుని ముందుకుపోతాం...
     - 68వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని మోడీ
     
     సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను ప్రధానమంత్రిని కాను. ప్రధాన సేవకుడిగా మీ మధ్యకు వచ్చాను. పాలకునిగా కాకుండా సేవకునిగా ప్రభుత్వాన్ని తెచ్చాను. పార్లమెంటులో సంఖ్యా బలంతో కాకుండా ఏకాభిప్రాయంతో దేశాన్ని నడిపిస్తాను.. ప్రతిపక్షాన్ని కలుపుకుని ముందుకుపోతాం’’ అని ప్రధానమంత్రి నరేంద్రమోడీ పేర్కొన్నారు. దేశ 68వ స్వాతంత్య్ర దినోత్సవ  సందర్భంగా ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోటపై ప్రధాని త్రివర్ణపతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం అక్కడి నుంచే జాతినుద్దేశించి 65 నిమిషాల పాటు సుదీర్ఘ ప్రసంగం చేశారు. అయితే.. తాను మాట్లాడే పోడియానికి బులెట్ ప్రూఫ్ రక్షణ కవచాన్ని మోడీ తిరస్కరించటం విశేషం. దాదాపు మూడు దశాబ్దాలుగా ప్రధానమంత్రులు ఎర్రకోట నుంచి బులెట్ ప్రూఫ్ అద్దాల గది నుంచి ప్రసంగిస్తుండగా.. మోడీ తొలిసారి ఆ రక్షణ లేకుండా ప్రసంగించారు. రెండు నెలల కిందటే ప్రధానిగా పగ్గాలు చేపట్టిన మోడీ.. ఎర్రకోట నుంచి చేసిన తన తొలి ప్రసంగంలో.. దేశాభివృద్ధికి, ఆర్థికవ్యవస్థ బలోపేతానికి తాను చేపట్టదలచుకున్న కార్యక్రమాలను, ఆలోచనలను వివరించారు. మోడీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... 
     
     ప్రణాళికా సంఘం రద్దు: అంతర్గతంగా, అంతర్జాతీయంగా మారిన ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని.. ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త సంస్థను తీసుకువస్తాం. భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే.. రాష్ట్రాలను ముందుకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. సమాఖ్య నిర్మాణం ప్రాధాన్యత గత 60 ఏళ్లలో కన్నా ఇప్పుడు మరింత ఎక్కువగా ఉంది. అతి త్వరలో ప్రణాళికాసంఘం స్థానంలో కొత్త సంస్థను నెలకొల్పుతాం. కొత్త ఆత్మతో కూడిన కొత్త వ్యవస్థ మనకు అవసరం. అది.. ప్రభుత్వ - ప్రయివేటు భాగస్వామ్యాన్ని, యువశక్తిని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా సృజనాత్మకతతో పాటు.. తాజా ఆవిష్కరణలు, ఆలోచనలు, ఆశలను తీసుకొస్తుంది. 
     పదేళ్ల పాటు హింసను వదిలేద్దాం: స్వాతంత్య్రం తరువాత కూడా మతం, కులం ప్రాతిపదికగా హింసను మనం చూస్తున్నాం. ఇలా ఎంత కాలం? ఇక గొడవలు, హత్యలు చాలు. దేశ ప్రగతి కోసం నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా.. హింసపై పదేళ్ల పాటు మారటోరియం ఉండాలి. కనీసం ఒక్కసారైనా. తద్వారా మనం ఈ రుగ్మతల నుంచి బయటపడతాం. మనం హింసా మార్గం వీడి.. సౌభ్రాతృత్వపు మార్గం అనుసరిస్తే.. అభివృద్ధి చెందుతాం. 
     
     కొడుకులపైనా ఆంక్షలు పెట్టాలి...
     అత్యాచారాల సంఘటనలు తీవ్ర ఆందోళనకరం. ఇలాంటి ఘటనల గురించి విన్నప్పుడు మన తలలు సిగ్గుతో వాలిపోతాయి. ప్రతి ఇంటిలోనే తల్లిదండ్రులు తమ కుమార్తెలను చాలా ప్రశ్నలు అడుగుతారు. కానీ.. వారు వారి కొడుకులను ఇవే ప్రశ్నలు అడుగుతారా? అత్యాచారం చేసేవాళ్లు కూడా ఒకరికి కొడుకులే కదా? అతడికి కూడా తల్లిదండ్రులు ఉన్నారు. కొడుకుల మీద  ఆంక్షలు పెడితే.. ఇక అత్యాచారాలకు పాల్పడేవాళ్లు, మావోయిస్టులు, ఉగ్రవాదులు ఉండరు. 
     
     సర్కారులో గోడలు బద్దలుకొడుతున్నా..
     నేను ఢిల్లీకి బయటి నుంచి వచ్చాను. ఇక్కడ ప్రభుత్వం ఎలా పనిచేస్తోందో లోపలి నుంచి చూశాను. నా వ్యాఖ్యలను రాజకీయ దృక్కోణం నుంచి చూడకూడదు. ప్రభుత్వంలో అంతర్గతంగా డజన్ల కొద్దీ ప్రభుత్వాలు చూసి దిగ్భ్రాం తికి లోనయ్యా. శాఖలను వారి వ్యక్తిగత సామంతరాజ్యాలుగా భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఒకే విభాగంగా చేయడానికి నేను ఈ గోడలను బద్దలుకొట్టడం మొదలుపెట్టా.  
     
     పరిశుభ్రమైన భారత్ కోసం పథకం...
     దేశాన్ని పరిశుభ్రంగా చేసే లక్ష్యంతో అక్టోబర్ 2 నుంచి ‘స్వచ్ఛ భారత్’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 2019 లో మహాత్మా గాంధీ 150వ జయంత్యుత్సవాల నాటికి ఈ లక్ష్యాన్ని పూర్తిచేస్తాం.   
     సంసద్ ఆదర్శ గ్రామ యోజన...
     పార్లమెంటు సభ్యుల ద్వారా గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ‘సంసద్ ఆదర్శ గ్రామ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఎంపీలు ప్రతి ఒక్కరూ తమ నియోజకవర్గాల్లో ఒక గ్రామాన్ని ఎంపిక చేసుకుని 2016 నాటికి దానిని ఆదర్శ గ్రామంగా రూపొందించాలి.’’
     
     అది దేశ ఆర్థిక గతిని
     నిర్దేశించిన ‘సంఘం’
     ఆరున్నర దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర గల ప్రణాళికాసంఘం త్వరలోనే ‘గత చరిత్ర’గా మారిపోనుంది. 1950లో ఆర్థికవ్యవస్థలో ప్రభుత్వ రంగానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిచ్చిన కాలంలో ప్రణాళికాసంఘాన్ని స్థాపించారు. నాటి ప్రధాని జవహర్‌లాల్‌నెహ్రూ.. సోవియట్ ప్రభావితమై.. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించేందుకు భారత ప్రణాళికాసంఘాన్ని నెలకొల్పారు. కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పాటైన ఈ సంఘానికి.. అపరిమిత అధికారం, ఎంతో ప్రతిష్ట ఉండేది. ఇది ఇప్పటివరకూ ప్రధాని అధ్యక్షతనే పనిచేస్తోంది. ఆయా రంగాల వారీగా అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించటం, వాటిని సాధించేందుకు వనరులను కేటాయించటం ఈ సంఘం ప్రధాన విధి. ప్రణాళికాసంఘానికి ఉపాధ్యక్షులు పనిచేసిన వారిలో చాలామంది.. రాజకీయ మహామహులే. ఆ పదవిలో ఉన్న వారికి కేబినెట్ మంత్రి హోదా ఉంటుంది. గుల్జారీలాల్‌నందా, వి.టి.కృష్ణమాచారి, సి.సుబ్రమణ్యం, పి.ఎన్.హక్సార్, మన్మోహన్‌సింగ్, ప్రణబ్‌ముఖర్జీ, కె.సి.పంత్, జశ్వంత్‌సింగ్, మధుదండావతే, మోహన్‌ధారియా, ఆర్.కె.హెగ్డే తదితరులు ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షులుగా బాధ్యతలు నిర్వర్తించారు. దీనికి చివరి ఉపాధ్యక్షుడు మాంటెక్‌సింగ్ అహ్లూవాలియా. అయితే.. 1990 ల్లో ఆర్థికవ్యవస్థ సరళీకరణ, ప్రపంచీకరణ బాటలో పయనించటం మొదలయ్యాక ప్రణాళికాసంఘం ప్రాధాన్యత కనుమరుగైంది.
     
      ప్రధానమంత్రి జన ధన యోజన
     దేశంలోని కోట్లాది మందికి ఫోన్లు ఉన్నాయి కానీ బ్యాంకు ఖాతాల్లేవు. ఈ పరిస్థితి నుంచి మార్పు తేవాలి. ‘ప్రధానమంత్రి జన ధన యోజన’ పేరుతో పేద కుటుంబాలకు బ్యాంకు ఖాతాలు, ఒక డెబిట్ కార్డు, లక్ష రూపాయల బీమా వర్తింపు పథకాన్ని అమలు చేస్తాం. పేద ప్రజలు, ప్రత్యేకించి రైతులను వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల నుంచి కాపాడేందుకు వారికి బ్యాంకింగ్ సేవలు అందించాల్సిన అవసరముంది. ఆర్థికాభివృద్ధి పేదలకు ప్రయోజనం అందించటం ఇక్కడి నుంచే మొదలవ్వాలి. 
     
     ‘స్కిల్ ఇండియా’ కోసం ఉద్యమం
     యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరచే నైపుణ్యాలను అందించేందుకు దేశవ్యాప్తంగా ‘స్కిల్ ఇండియా (నైపుణ్య భారత్)’ ఉద్యమాన్ని ప్రారంభిస్తాం. యువత పరిశ్రమలను నెలకొల్పే స్ఫూర్తిని వెలికితీసి.. మనం విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వివిధ వస్తువులను దేశంలోనే తయారు చేసే పరిశ్రమలను నెలకొల్పాలి. ‘మేడ్ ఇన్ ఇండియా’ అనేదాన్ని నాణ్యతకు మారుపేరుగా మార్చాలి. దేశంలో పారిశ్రామిక అభివృద్ధికి తోడ్పడేలా భారత్‌లో పెట్టుబడులు పెట్టటానికి ప్రపంచవ్యాప్తంగా గల పారిశ్రామికవేత్తలను ఆహ్వానించటానికి ‘భారత్ వచ్చి తయారు చేయండి’ అనే పిలుపునిస్తున్నాం. దేశాన్ని రైల్వే కలుపుతుందనేది ఒకప్పటి మాట. దేశ ప్రజలను కలిపే శక్తి ఐటీకి ఉందని నేను చెప్తున్నా. దేశం కోసం మా కల.. డిజిటల్ ఇండియా. పౌరులను సాధికారులను చేయడానికి సమాచార సేవలను సమయానికి, సమర్థవంతంగా అందించటానికి డిజిటల్ ఇండియాను రూపొందించే లక్ష్యానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. 
     
మరిన్ని వార్తలు