నేను ’రాంబో’ని కాను: నితీష్ కుమార్

2 Jul, 2013 00:24 IST|Sakshi
నేను ’రాంబో’ని కాను: నితీష్ కుమార్
ఉత్తరాఖండ్‌లో చిక్కుకుపోయిన బీహారీలను రక్షించేందుకు సరైన చర్యలు తీసుకోలేదనే బీజేపీ విమర్శలపై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. సోమవారం గుజరాత్ సీఎం నరేంద్రమోడీ లక్ష్యంగా ప్రతి విమర్శలు చేశారు. ‘ఉత్తరాఖండ్ నుంచి బీహారీలను రక్షించి తీసుకురావడానికి నేను నేను రాంబో తరహా వ్యక్తిని కాదు. అంతటి శక్తీ నాకు లేదు..’ అని అన్నారు. కానీ వరదల్లో చిక్కుకుపోయిన తమ యాత్రికులకు సహాయం అందించేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు నితీశ్ పేర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే తమ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులతో కూడిన బందాన్ని సహాయ చర్యల నిమిత్తం ఉత్తరాఖండ్‌కు పంపిందన్నారు.
 
ఆ రాష్ట్ర సీఎం విజయ్ బహుగుణతో కూడా తాను మాట్లాడానని, సహాయ నిధి కోసం రూ.5 కోట్లు విరాళంగా ప్రకటించామని తెలిపారు. వరద విపత్తుకు గురైన ఉత్తరాఖండ్‌ను మోడీ సందర్శించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన రాంబో మాదిరి 15 వేల మంది గుజరాతీలను కాపాడినట్లు ఓ పత్రిక పేర్కొనడం వివాదాస్పదమైంది. మోడీ కేవలం గుజరాతీలను ఆదుకునేందుకే ప్రయత్నించడం విచారకరమని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రయత్నించారని కాంగ్రెస్ ధ్వజమెత్తింది. మోడీ తన ధ్రుక్కోణాన్ని విస్తత పరుచుకోవాల్సిన అవసరం ఉందంటూ శివసేన సైతం విమర్శించింది.
 
మరిన్ని వార్తలు