యూపీ సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చిన మౌర్య

10 Mar, 2017 18:12 IST|Sakshi
యూపీ సీఎం అభ్యర్థిపై క్లారిటీ ఇచ్చిన మౌర్య

లక్నో :  ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో తాను లేనని ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేశవ ప్రసాద్‌ మౌర్య స్పష్టం చేశారు. యూపీలో తామే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన శుక్రవారమిక్కడ స్పష్టం చేశారు. సీఎం పీఠంపై అఖిలేష్‌కు తాము ఎలాంటి మద్దతు ఇవ్వబోమని మౌర్య తేల్చి చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేదల పెన్నిధి అని ఆయన అభివర్ణించారు.

మరోవైపు సీఎం అభ్యర్థిగా పార్టీ ఎంపీ యోగి ఆదిత్యానాథ్‌ పేరు కూడా తెరమీదకు వచ్చింది. కాగా యూపీ బీజేపీ సొంతం కానుందని ఎగ్జిట్‌పోల్స్‌ ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా ఉన్న యూపీకి బీజేపీ ఏ వ్యక్తికి ముఖ్యమంత్రిగా పట్టం కడుతుందనేది ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతోంది. సీనియారిటీ ఆధారంగా ఇస్తారా? ప్రతిభ ఆధారంగా ఇస్తారా? కమ్యూనిటీ పరంగా ఇస్తారా? అభివృద్ధి ఆలోచనలు కలిగిన వ్యక్తికి అప్పగిస్తారా? అని సర్వత్రా చర్చ నడుస్తోంది. బీజేపీ అధిష్టానం కూడా ఇప్పటికే ఒక అవగాహనకు వస్తున్నట్లు సమాచారం.

ఇక ఏ రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి కావాలంటే శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి గెలవాలి. తన పార్టీని గెలిపించుకోవాలి. గెలిచిన శాసనసభ్యుల నాయకుడిగా ఎంపికవ్వాలి. అయితే యూపీలో పరిస్థితి మాత్రం ఇందుకు భిన్నంగా సాగింది. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో .. సీఎం అభ్యర్థులెవరూ ఎన్నికల బరిలో నిలబడలేదు. యూపీలో ఏడు దశల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి.  అధికార ఎస్పీ, బీఎస్పీ, బీజేపీ, కాంగ్రెస్‌ సహా పలు పార్టీలు బరిలో నిలిచాయి. అయితే పార్టీల ముఖ్యమంత్రి అభ్యర్థులు మాత్రం ఎన్నికల్లో పోటీచేయలేదు. యూపీ ప్రస్తుత ముఖ్యమంత్రి, ఎస్పీ-కాంగ్రెస్‌ కూటమి తరఫున సీఎం అభ్యర్థి కూడా అఖిలేశ్‌ యాదవే.

కానీ ఆయన ఎన్నికల్లో ఎక్కడ నుంచీ పోటీ చేయలేదు. బీఎస్పీ అధినేత్రి మాయావతిది కూడా ఇదే బాట. రాష్ట్రీయ లోక్‌దళ్‌ ముఖ్యమంత్రి అభ్యర్థి జయంత్‌ చౌదరి కూడా ప్రజాతీర్పు కోసం బరిలో దిగిలేదు. అలాగే బీజేపీ అయితే తమ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో  ప్రకటించ కుండానే ఎన్నికలకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఎగ్జిట్‌ పోల్స్‌ బీజేపీకి అనుకూలంగా రావడంతో  ఫలితాలు వెల్లడైన తర్వాతే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటిస్తుందని వార్తలు వెలువడుతున్నాయి.

>
మరిన్ని వార్తలు