నా క్రెడిట్ ను బాస్ కొట్టేశాడు!

6 Jun, 2015 17:45 IST|Sakshi
నా క్రెడిట్ ను బాస్ కొట్టేశాడు!

అగ్రా:ఇప్పటికే మ్యాగీ నూడుల్స్ వివాదం సర్వత్రా ఆసక్తిగా మారిన తరుణంలో తాజాగా మరో కొత్త కోణం వెలుగు చూసింది. మ్యాగీ నూడుల్స్ నిషేధంలో అసలు కీలక పాత్ర పోషించిందెవరు?, ఆ నూడుల్స్ లో హానికరమైన రసాయనాలన్నట్లు గుర్తించిన వారెవరు? ఇప్పడు అదే అంశంపై రగడ మొదలైంది. మ్యాగీ నూడుల్స్ దర్యాప్తులో తాను ప్రముఖ పాత్ర పోషించినా.. ఆ క్రెడిట్ ను తన బాస్ కొట్టేశాడంటూ  ఫుడ్ ఇన్ స్పెక్టర్ సంజయ్ సింగ్ ఆరోపిస్తున్నాడు.

 

'అసలు మ్యాగీ న్యూడిల్స్ దర్యాప్తులో కీలక పాత్ర నాది. దాదాపు సంవత్సరం పైనుంచి నూడిల్స్ పై దర్యాప్తు కొనసాగిస్తున్నా. మా డిపార్ట్ మెంట్ నుంచి పూర్తి స్థాయిలో మద్దతు లేకపోయినా నూడుల్స్ విచారణను యథావిధిగా చేశా.  మ్యాగీ నూడుల్స్ ను ల్యాబ్ పరీక్షించి వాటిలో హానికరమైన రసాయనాలున్నట్లు ధృవీకరించా. అయితే మా బాస్ వికే పాండే ఆ క్రెడిట్ ను మొత్తం కొట్టేశాడు'అని సంజయ్ సింగ్ ఆరోపణలకు దిగాడు.  2014, మార్చి 10న మ్యాగీ నూడుల్స్ శాంపిల్స్ ను బారాబాంకీ మార్కెట్ నుంచి సేకరించి .. ఆ తరువాత దర్యాప్తుకు గోరఖ్ పూర్ ల్యాబ్ కు తీసుకువెళ్లి దర్యాప్తు కొనసాగించినట్లు సంజయ్ తెలిపాడు.

 

మ్యాగీ నూడుల్స్‌పై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. మ్యాగీ ఇన్‌స్టంట్ నూడుల్స్‌కు చెందిన అన్ని రకాల ఉత్పత్తులను తక్షణమే మార్కెట్ నుంచి ఉపసంహరించాలని మ్యాగీని ఉత్పత్తి చేసే ప్రఖ్యాత స్విస్ సంస్థ నెస్లేను భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ(ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ) శుక్రవారం ఆదేశించింది. అలాగే, మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తి, అమ్మకాల పైనా నిషేధం విధించింది.

మరిన్ని వార్తలు