నేనే శ్రామిక్ నంబర్1

2 May, 2016 00:51 IST|Sakshi
నేనే శ్రామిక్ నంబర్1

ప్రధాని మోదీ వ్యాఖ్య
♦ 5 కోట్ల పేదలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్ల పథకం ప్రారంభం
♦ కార్మికుల సంక్షేమానికి  పలు పథకాలు తెచ్చాం
♦ ఎందరో ప్రధానులను అందించిన యూపీలో పేదరికం అలాగే ఉంది
♦ వారణాసిలో ఈ-బోట్లను ప్రారంభించిన నరేంద్ర మోదీ
 
 బాలియా (యూపీ): ప్రధాని నరేంద్ర మోదీ తనను తాను శ్రామిక్ (కార్మికుడు) నంబర్ 1 గా అభివర్ణించుకున్నారు. దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది పేదలకు ఉచిత ఎల్పీజీ కనెక్షన్లు ఇచ్చే ‘ఉజ్వల యోజన’ను ఆయన ఆదివారమిక్కడ ప్రారంభించి ప్రసంగించారు. కార్మికుల శ్రేయస్సుకోసం కేంద్రం వివిధ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అంతకుముందు ప్రభుత్వాలు పేదలకు చేసింది శూన్యమని మోదీ విమర్శించారు. అందుకే తమ ప్రభుత్వం రూ.8 వేల కోట్లతో 5 కోట్ల మంది పేదలకు ఉచితంగా ఎల్పీజీ కనెక్షన్లు  ఇస్తుందని తెలిపారు. మొదటి ఏడాది కోటిన్నర మందికి ఆ తర్వాత మూడేళ్లలో మిగిలిన పేదలకు ఈ కనెక్షన్లు  అందజేస్తామన్నారు.

‘భారతదేశానికి ఉత్తరప్రదేశ్ చాలామంది ప్రధానులను ఇచ్చింది. కానీ ఇక్కడి పేదరికం మాత్రం ఇలాగే ఉంది. ఎన్నో పథకాలను తెచ్చారు. లెక్కలేనన్ని హామీలిచ్చారు. కానీ అవన్నీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేసినవే. నిజంగా పేదరికాన్ని నిర్మూలించేందుకు ఉద్దేశించినవి కాదు’ అని మోదీ అన్నారు. పేదలకు సరైన విద్య, ఉద్యోగ అవకాశాలతోపాటు, ఇళ్లు, తాగునీరు,  వంటి అవకాశాలిచ్చి సాధికారత కల్పించినపుడే పేదరికాన్ని నిర్మూలించవచ్చన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే దీన్ని సాధిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది యూపీలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకోసమే ఈ పథకాన్ని ప్రారంభించారంటూ వస్తున్న విమర్శలపై ప్రధాని మండిపడ్డారు.

‘రాజకీయ పండితులు ఎన్నికల ప్రచారం ప్రారంభమైదంటున్నారు. కానీ వీరికి తెలియనిదేమంటే దేశంలో అతి తక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉన్న (ఇక్కడ ప్రతి వంద ఇళ్లలో సగటున ఎనిమిదిళ్లకే కనెక్షన్ ఉంది) జిల్లా అయినందునే బాలియాలో దీన్నిప్రారంభిస్తున్నా’ అని చెప్పారు. బీజేపీ ప్రభుత్వం ఏం చేసినా పేదలను దృష్టిలో ఉంచుకునేనన్న విషయాన్ని మరవొద్దని తెలిపారు. వెయ్యి రూపాయల కనీస పెన్షన్, కార్మికులకు గుర్తింపు నంబరు(ఎల్‌ఐఎన్) ఇచ్చిన ఘనత కూడా తమ ప్రభుత్వానిదేనన్నారు.

 వారణాసిలో బిజీ బిజీ: అనంతరం వారణాసిలో జరిగిన కార్యక్రమంలో 11 వేలమంది లబ్ధిదారులకు ఈ-రిక్షా లను ప్రధాని పంపిణీ చేశారు. డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో కళాకారులు, విద్యావేత్తలు, న్యాయమూర్తులు, స్వయంసహాయక బృందాలతో ప్రధాని సమావేశమయ్యారు. ఇటీవల 126 గంటలపాటు నిర్విరామంగా కథక్ నృత్యం చేసి ప్రపంచరికార్డు నెలకొల్పిన కళాకారిణి సోనీ చౌరాషియాను ప్రధాని కలిసి అభినందించారు. అనంతరం అస్సీఘాట్‌లో 11 సోలార్ విద్యుత్‌తో నడిచే బోట్లను స్థానిక నిషాద్ (గంగానదిలో బోట్లు నడిపేవారు) లకు అందజేశారు. ఈ సందర్భంగా నెహ్రూ-గాంధీ కుటుంబంపై మోదీ నిప్పులు చెరిగారు. భారతదేశం సొంత జీపీఎస్ వ్యవస్థ ఏర్పాటుచేసుకునేందుకు ఇటీవలే ప్రవేశపెట్టిన ఉపగ్రహ వ్యవస్థకు ‘నావిక్’ అని పేరుపెట్టామని.. గాంధీ కుటుంబంలో వారి పేర్లు పెట్టలేదని ఎద్దేవా చేశారు.
 
 చెప్పిందే చేస్తున్నాం
 ఇప్పటివరకు విద్యుత్ స్తంభం కూడా చేరని 18వేల గ్రామాలకు వెయ్యిరోజుల్లో విద్యుత్ ఇచ్చేందుకు కట్టుబడి ఉన్నామని.. హామీ ఇచ్చిన 250 రోజుల్లోనే 1,326 గ్రామాలకు విద్యుత్ వెలుగులిచ్చామని మోదీ వెల్లడించారు. ప్రజలు కూడా తమ కార్యక్రమాలకు సహకరిస్తున్నారని కోటి పదిలక్షల మంది ఒక్క పిలుపుతోనే ఎల్పీజీ సబ్సిడీ వదులుకున్నారని గుర్తుచేశారు. స్వేదం చిందించటం ద్వారా ప్రపంచాన్ని ఐక్యం చేయటం ఈతరం కార్మికుల నినాదం కావాలని ప్రధాని ఆకాంక్షించారు.

మరిన్ని వార్తలు