అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంచలన వ్యాఖ్యలు

5 Jul, 2017 11:05 IST|Sakshi
అసెంబ్లీ సాక్షిగా మంత్రి సంచలన వ్యాఖ్యలు

జమ్మూకశ్మీర్ అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర మంత్రి ఇమ్రాన్ అన్సారీ ప్రతిపక్ష పార్టీ నేత దేవేందర్ రాణాను సభలోనే చంపి పాతరేస్తానంటూ బెదిరించారు. వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) విషయంపై అసెంబ్లీలో మంగళవారం చర్చ జరగగా.. చివరికి అది వ్యక్తిగత బెదిరింపులకు దారితీసింది. ఆ వివరాలిలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి నుంచి దేశంలో అంతటా జీఎస్టీ అమలు అయినా, జమ్మూకశ్మీర్ లో మాత్రం జీఎస్టీ అమలు చేయడం లేదు. ఇంత వరకూ జీఎస్టీని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఆమోదించకపోవడంతో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం అమలు వాయిదా పడింది. దీనిపై జుమ్మూకశ్మీర్ అసెంబ్లీలో నిన్న ప్రతిపక్ష నేషనల్ కాన్ఫరెన్స్ నేత దేవేందర్ రాణా ఆసంతృప్తి వ్యక్తం చేశారు.

దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టిన ఏకపన్ను విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే యత్నం చేశారు. తాను పన్నులు ఎగ్గొట్టలేదని, చీకటి వ్యాపారాలు చేయాల్సిన ఖర్మ తనకు పట్టలేదని అధికార పక్ష నేతలకు బదులిచ్చారు. ఓ వైపు ఎమ్మెల్యే రాణా మాట్లాడుతుండగా.. రాష్ట్ర ఐటీ, సాంకేతిక విద్య శాఖలమంత్రి ఇమ్రాన్ అన్సారీ కలుగజేసుకుని 'నేను తలుచుకుంటే నిన్ను ఇక్కడే చంపేయగలను. నీ దొంగ వ్యాపారాలు నాకు తెలుసు. రాష్ట్రంలో నీ కంటే పెద్ద దొంగ ఎవరూ లేరు. మోబిల్ ఆయిల్‌ అమ్ముతూ వ్యాపారాలు మొదలుపెట్టావ్. నీకు అన్ని ఆస్తులు ఎక్కడినుంచి వచ్చాయో మాకు తెలియదనుకున్నావా' అంటూ బెదిరింపు చర్యలకు పాల్పడ్డారు. మంత్రి అన్సారీ వ్యాఖ్యలతో సభలో కాసేపు గందరగోళ పరిస్థితి తలెత్తింది. ఏకంగా అసెంబ్లీలోనే మంత్రి చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశం అయ్యాయి.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు