‘ఆమెతో నో ప్రాబ్లమ్‌.. కానీ అల్లుడే’

30 Oct, 2017 18:47 IST|Sakshi

తిరువనంతపురం: తన కూతురు ఏ మతంలోకి మారిపోయినా తనకు ఇబ్బంది లేదని లవ్‌ జిహాద్‌ కేసుతో సంచలనం సృష్టించిన హదియా/అఖిల తండ్రి అశోకన్‌ కేఎం అన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా తన కుమార్తెను న్యాయస్థానం ఎదుట హాజరుపరుస్తానని చెప్పారు. హదియాను గృహనిర్బంధం చేసినట్టు తమపై అసత్య ప్రచారం చేస్తున్నారని వాపోయారు.

‘నవంబర్‌ 27న ఆమెను కోర్టులో హాజరుపరుస్తా. ఆమె ఏ మతంలోకి మారినా నాకు ఎటువంటి సమస్య లేదు. కానీ షఫిన్ జహాన్‌ను మాత్రం అంగీకరించం(హదియా భర్త). ఆమె పోరాటాన్ని ఎవరు అడ్డుకోవడం లేదు. ఆమె గృహనిర్బంధంలో లేదు. పోలీసు అధికారులు చుట్టూ ఉండటంతో ఆమె తనకు తానుగా బయటకు వెళ్లకూడదని నిర్ణయించుకుంది. మొదటి నుంచి నామీద, మా కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్నార’ని అశోకన్‌ వాపోయారు. హదియాను తమ ఎదుట ప్రవేశపెట్టాలని సుప్రీంకోర్టు ఆదేశించడం పట్ల షఫిన్ జహాన్‌ అమిత సంతోషం వ్యక్తం చేశాడు. ఆమె చెప్పేది విన్నతర్వాత అంతా తమకు అనుకూలంగా జరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. సుప్రీం ఆదేశాలను కేరళ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ ఏంసీ జొసెప్పైన్‌ స్వాగతించారు. తాము కోరుకున్నట్టుగా హాదియా అభిప్రాయాన్ని న్యాయస్థానం వినబోతోందని, ఆమెకు ఎటువంటి హాని జరగకుండా చూసుకునే బాధ్యత తమపై ఉందన్నారు.

కేరళకు చెందిన 24 ఏళ్ల అఖిల అశోకన్‌ను ఇస్లాం మతంలోకి మారి షఫిన్ జహాన్ అనే ముస్లిం యువకుడిని పెళ్లి చేసుకుంది. ‘లవ్‌ జిహాద్‌’గా భావించిన హైకోర్టు వీరి వివాహాన్ని రద్దు చేసింది. హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షఫిన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హదియాను స్వచ్ఛందంగా మతమార్పిడి చేసుకుందా, లేదా తెలుసుకునేందుకు నవంబర్‌ 27న ఆమెను తమ ఎదుట హాజరుపరచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడంతో ఈ కేసులో ఉత్కంఠ కొనసాగుతోంది.

మరిన్ని వార్తలు