మోడీ ప్రధాని కావడం నాకిష్టంలేదు:అమర్త్యసేన్

23 Jul, 2013 05:03 IST|Sakshi
మోడీ ప్రధాని కావడం నాకిష్టంలేదు:అమర్త్యసేన్


న్యూఢిల్లీ: గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీకి లౌకిక విలువలు లేవని, అందువల్ల ఆయన ప్రధాని కావాలని తాను కోరుకోవడం లేదని నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ అన్నారు. ప్రముఖ ఆర్థికవేత్త అయిన అమర్త్యసేన్ ‘సీఎన్‌ఎన్-ఐబీఎన్’ చానల్‌తో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రధాని కావాలని మీరు కోరుకుంటారా అని అడగ్గా.. ‘‘మోడీ ప్రధాని కావాలని ఓ భారతీయ పౌరుడిగా నేను కోరుకోను. మైనారిటీలు తమకు ఇక్కడ రక్షణ ఉందని భావించే ఒక్క పనీ ఆయన చేయలేదు’’ అని అన్నారు. ఎందుకు కోరుకోరు అని అడగ్గా.. ‘‘ఆయన ముందు మరింత లౌకికవాదిగా ఉండి ఉండాలి. మైనారిటీలు తమకు ఇక్కడ తగిన భద్రత ఉందని ఫీలయ్యే పనులు చేసి ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు.

ఆయన రికార్డు బాగుందని నేను అనుకోవడం లేదు. భద్రత లేదని భావించడానికి నేను మైనారిటీ సభ్యుడినే కానక్కర్లేదు. మైనారిటీలకు అభద్రత అనిపించే పరిస్థితి రావడాన్ని మన భారతీయులు ఇష్టపడరు. అలాగే 2002లో గుజరాత్‌లో వ్యవస్థీకృత హింస జరిగిందని అందరూ అనుకుంటున్నారు. అలాంటి రికార్డు ఉన్న వ్యక్తి ప్రధాని కావాలని నేను కోరుకోను’’ అని అన్నారు. గుజరాత్‌లో భౌతికమైన మౌలిక సదుపాయాలు బాగా ఉండొచ్చుగానీ.. మైనారిటీలు అలాగే మెజారిటీల కోసం మోడీ చేసిందేమీ లేదని అన్నారు. ఆరోగ్య, వైద్య రంగాల్లో మోడీ చేయాల్సింది చాలా ఉందని అమర్త్యసేన్ అభిప్రాయపడ్డారు.

మరిన్ని వార్తలు