అందరికీ సొంతిళ్లు నా స్వప్నం

24 Aug, 2018 03:32 IST|Sakshi
జునాగఢ్‌లో ప్రసంగిస్తున్న మోదీ

2022 నాటికి అది సాకారమవుతుంది!

గుజరాత్‌లో పీఎం ఆవాస్‌ యోజన లబ్ధిదారులతో మోదీ

జుజ్వా (గుజరాత్‌): దేశం 75వ స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే 2022 నాటికి ప్రతి కుటుంబం సొంత ఇళ్లు కలిగి ఉండేలా చూడటమే తన స్వప్నమని ప్రధాని మోదీ అన్నారు. దళారుల పాత్ర లేకపోవడం వల్ల ప్రభుత్వం విడుదలచేస్తున్న ప్రతి పైసా లక్షిత లబ్ధిదారులకే చేరుతోందన్నారు. గుజరాత్‌ వల్సాద్‌ జిల్లాలోని జుజ్వాలో గురువారం నిర్వహించిన ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన లబ్ధిదారుల సామూహిక ఆన్‌లైన్‌ గృహ ప్రవేశ కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. తర్వాత బహిరంగ సభలో మాట్లాడారు.

ప్రభుత్వం విడుదల చేసిన ప్రతి రూపాయిలో కేవలం 15 పైసలే లబ్ధిదారులకు వెళ్తోందన్న మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ వ్యాఖ్యల్ని పరోక్షంగా ప్రస్తావించారు. ఇప్పుడు తమ ప్రభుత్వం విడుదలచేస్తున్న ప్రతి పైసా లబ్ధిదారులకు చేరుతోందని అన్నారు. కేంద్ర పథకాల ప్రయోజనాలు పొందడానికి లబ్ధిదారులు లంచాలు చెల్లించనక్కర్లేదని నొక్కిచెప్పారు. వల్సాద్‌ జిల్లా కొండ ప్రాంతాల్లోని సుమారు 175 గ్రామాలకు తాగునీరు అందించే రూ.586 కోట్ల ప్రాజెక్టుకు భూమిపూజ చేశారు.

కాంట్రాక్టర్లు కాదు.. లబ్ధిదారులపైనే నమ్మకం:
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద నాణ్యమైన ఇళ్లు నిర్మించి ఇచ్చేందుకు శాయశక్తులా కృషిచేస్తున్నామని మోదీ అన్నారు. ‘ఇళ్లు పొందేందుకు లంచాలు ఇచ్చారా? అని దేశం మొత్తం చూస్తుండగా, మీడియా సమక్షంలోనే లబ్ధిదారులను ప్రశ్నించే ధైర్యం మా ప్రభుత్వానికి ఉంది. నిబంధనల ప్రకారమే ఇళ్లు వచ్చాయని, లంచం చెల్లించే అవసరం రాలేదని తల్లులు, సోదరీమణులు సంతృప్తికర సమాధానమిస్తారని పూర్తిగా విశ్వసిస్తున్నా.

ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తున్నా, ఇంటిని ఎలా నిర్మించాలి? ఏయే సామగ్రి వినియోగించాలి? లాంటి వాటిని కుటుంబమే నిర్ణయిస్తుంది. కాంట్రాక్టర్లు కాకుండా లబ్ధిదారులపైనే నమ్మకం ఉంచుతాం’ అని మోదీ అన్నారు. సొంతిళ్లు పొందటంపై లబ్ధిదారుల అనుభవాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. పారిశుధ్యం, బాలికల విద్య, నీటి సరఫరా, విద్యుత్, గ్యాస్‌ కనెక్షన్‌ తదితరాల గురించి వాకబు చేశారు. వచ్చే ఏడాదిన్నర కాలంలో దేశంలో విద్యుత్‌ సౌకర్యంలేని ఇళ్లు ఉండబోదని ధీమా వ్యక్తం చేశారు.

‘స్వచ్ఛ్‌భారత్‌’ అప్పుడే చేపట్టి ఉంటే..
స్వచ్ఛ్‌భారత్‌ లాంటి పారిశుధ్య కార్యక్రమాలను 70 ఏళ్ల క్రితమే ప్రవేశపెట్టి ఉంటే దేశం ఇప్పటికే వ్యాధిరహితంగా మారేదన్నారు. పారిశుధ్యానికి చేపట్టిన చర్యల వల్లే 3 లక్షల మంది చిన్నా రులను కాపాడుకోగలిగామని ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికను ఉటంకించారు. జునాగఢ్‌లో గుజరాత్‌ మెడికల్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ రీసెర్చ్‌ సొసైటీ ఆసుపత్రిని ప్రారంభించారు. ‘టాయిలెట్లు నిర్మించడం, చెత్త ఏరడం... ఇవి ప్రధాని పనులా? అని విపక్షాలు హేళనచేశాయి. ఈ పనులన్నీ 70 ఏళ్ల క్రితమే చేసి ఉంటే నేడు దేశంలో ఒక్క వ్యాధి కూడా ఉండేది కాదు’ అని అన్నారు. తర్వాత గాంధీ నగర్‌లో గుజరాత్‌ ఫోరెన్సిక్‌ సైన్స్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు