ఉగ్రవాది అమరుడు కాలేడు

6 Aug, 2016 03:34 IST|Sakshi
ఉగ్రవాది అమరుడు కాలేడు

ఆ విషయం పాక్‌కు చెప్పాం: పార్లమెంటులో రాజ్‌నాథ్ వెల్లడి
ఇస్లామాబాద్‌లో సార్క్ సదస్సు వివరాలపై ప్రకటన 
పాక్‌లో తనకు సరైన ఆతిథ్యం ఇవ్వలేదని విమర్శ

 న్యూఢిల్లీ : జమ్మూకశ్మీర్‌లో హతమైన హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఉదంతం నేపథ్యంలో.. ఒక దేశంలో ఉగ్రవాదిగా ఉన్న వ్యక్తి మరో దేశానికి అమరవీరుడు కాలేడని పాకిస్తాన్‌కు స్పష్టం చేసినట్టు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ వెల్లడించారు. ఉగ్రవాదులను కీర్తించడం, ప్రోత్సహించడం మానుకోవాలని సార్క్ దేశాలను కోరినట్టు చెప్పారు. పాక్ రాజధాని ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన సార్క్ దేశాల హోంమంత్రుల సమావేశానికి తాను హాజరైన అంశంపై రాజ్‌నాథ్ శుక్రవారం పార్లమెంటు ఉభయసభల్లో సుమోటోగా ప్రకటన చేశారు.  బుర్హాన్‌ను అమరవీరుడిగా, దేశ భక్తుడిగా పాక్ కీర్తించటం.. దానిపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉగ్రవాదిని అమరవీరుడిగా కీర్తించటం తగదని పాక్‌కు చెప్పినట్లు రాజ్‌నాథ్ తెలిపారు.

సార్క్  సదస్సులో ఉగ్రవాదం, మాదకద్రవ్యాల అక్రమ రవాణా, సైబర్ నేరాలు, మనుషుల క్రయవిక్రయాల అంశాలపై చర్చించారని, చాలా దేశాలు అన్ని రూపాల ఉగ్రవాదాన్నీ ఖండించాయని చెప్పారు. నేర విషయాలపై సహకారానికి సంబంధించి సార్క్ సదస్సు తీర్మానాన్ని పాక్ ఆమోదిస్తుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. ఈ అంశాలపై త్వరలో చర్యలు చేపడతామని పాక్ చెప్పిందని.. ఆ ‘త్వరలో’ అనేది నిజంగానే త్వరగా జరుగుతుందని ఆశిస్తున్నానన్నారు.

ఉగ్రవాదం పట్ల మంచి ఉగ్రవాదం, చెడ్డ ఉగ్రవాదం అంటూ  వివక్ష చూపొద్దన్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న లేదా మద్దతిస్తున్న రాజ్య, రాజ్యేతర శక్తులపై అన్ని సమర్థవంతమైన చర్యలూ చేపట్టటం అవసరమన్నారు. ఉగ్రవాదులపై ప్రపంచ సమాజం విధించిన ఆంక్షలు, నిషేధాలను గౌరవించాలని సార్క్ మంత్రులకు తాను సూచించినట్లు చెప్పారు. అలాగే.. ఉగ్రవాద వ్యతిరేక వ్యవస్థ మెరుగుదల కోసం నిఫుణుల కమిటీ భేటీని ఈ ఏడాది సెప్టెంబర్ 22, 23 తేదీల్లో ఢిల్లీలో ఏర్పాటు చేసేందుకు భారత్ సంసిద్ధత వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు.

విందు కోసం వెళ్లలేదు..
పాక్  హోమంత్రి సార్క్ సదస్సుకు వచ్చిన అందరినీ విందుకు పిలిచిన మాట వాస్తమే అని.. తర్వాత ఆయన తన కారులో వెళ్లిపోవడంతో తానూ వెళ్లిపోయానని రాజ్‌నాథ్ చెప్పారు. పాక్‌లో తనకు సరైన ఆతిథ్యం ఇవ్వలేదన్నారు. అయితే  విందు కోసం ఆ దేశానికి వెళ్లలేదంటూ దీనిపై ఫిర్యాదు చేయదలచుకోలేదని చెప్పారు. దీంతో సభ్యులు బల్లలపై చరుస్తూ మద్దతు తెలిపారు. సదస్సులో తాను ప్రసంగిస్తుండగా భారత మీడియాను అనుమతించలేదన్న ఎంపీల ప్రశ్నకు జవాబిచ్చారు. ‘ఆ అది లైవ్ టెలికాస్టా, కాదా.. అనేది తెలియదు. అయితే ఆ సమయంలో దూరదర్శన్, పీటీఐ, ఏఎన్‌ఐ ప్రతినిధులకు అనుమతి ఇవ్వలేదనేది వాస్తవం’ అని చెప్పారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా