బతకాలని లేదు: సునంద

29 May, 2018 03:55 IST|Sakshi

చావుకై ప్రార్థిస్తున్నా

మరణానికి ముందు భర్తకు పంపిన మెయిల్‌లో సునంద పుష్కర్‌

న్యూఢిల్లీ: ‘నాకు బతకాలనే కోరిక లేదు. చావు కోసం ప్రార్థిస్తున్నా’... చనిపోవడానికి సరిగ్గా 9 రోజుల ముందు సునంద పుష్కర్, తన భర్త, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్‌కు పంపిన ఈ–మెయిల్‌లోని మాటలివి. 2014 జనవరి 17న దక్షిణ ఢిల్లీలోని ఓ విలాసవంతమైన హోటల్‌ గదిలో సునంద అనుమానాస్పద రీతిలో శవమై కనిపించడం తెలిసిందే. భర్తకు ఆమె పంపిన ఈ–మెయిల్‌లోని అంశాలను పోలీసులు సోమవారం స్థానిక కోర్టుకు సమర్పించారు. విషపు మాత్రలు శరీరంలోకి వెళ్లడం వల్లే సునంద చనిపోయారనీ, అంతకుముందే ఆమెకు కొన్ని గాయాలు కూడా అయినట్లు పోస్టుమార్టమ్‌ నివేదికలోనే తేలిందని పోలీసులు కోర్టుకు తెలిపారు.

ఆమె శశి థరూర్‌కు పంపిన మెయిల్, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులనే మరణ వాంగ్మూలాలుగా పరిగణించాలని కోరారు. ‘ఒకవేళ సునంద ఆత్మహత్య చేసుకుందని భావిస్తే అంతకుముందు ఆమె ఎన్నో వేధింపులకు గురై బాధను భరించి ఉంటుంది. ఈ అంశాన్ని పరిగణనలోనికి తీసుకుని ఆత్మహత్యకు ప్రేరేపించిన అంశంపై థరూర్‌ని నిందితుడిగా చేర్చాలి’ అని పోలీసుల తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సునందను థరూర్‌ శారీరక, మానసిక హింసకు గురి చేశారనీ, ఆమె ఆత్మహత్య చేసుకుందనీ భావించినా అందుకు కారణం ఆయనేనని ఈ నెల 14న కూడా పోలీసులు కోర్టుకు విన్నవించడం తెలిసిందే. కాగా, థరూర్‌ను నిందితుడిగా చేర్చేందుకు ఆయనకు నోటీసులు పంపాలా వద్దా అనే నిర్ణయాన్ని కోర్టు జూన్‌ 5కు వాయిదా వేసింది. 

మరిన్ని వార్తలు