నేను ప్రత్యూషను కొట్టాను...

14 Apr, 2016 13:22 IST|Sakshi
నేను ప్రత్యూషను కొట్టాను...

టీవీనటి ప్రత్యూష బెనర్జీ అనుమానాస్పద మరణంపై ఆమె బాయ్‌ఫ్రెండు రాహుల్ రాజ్ సింగ్ మాజీ ప్రియురాలు సలోని శర్మ తొలిసారి మౌనం వీడారు. మీడియాతో మాట్లాడిన ఆమె కొన్ని సంచలన విషయాలను వెల్లడించారు. దీంతో ఈ ఉదంతంలో రాహుల్ ప్రమేయంపై అనుమానాలు బలపడుతున్నాయి.  ఈ ఫిబ్రవరి 11 తాను ప్రత్యూష బెనర్జీని కొట్టినట్లు సలోని అంగీకరించారు. అయితే తాను కావాలని కొట్టలేదని, ప్రతీకారంగానే అలా చేశానని చెప్పుకొచ్చారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, వాట్సాప్ లో ఆమె కాంటాక్ట్ ను బ్లాక్ చేశానన్నారు.

రాహుల్ ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ కోసం పెట్టుబడి పెట్టిన డబ్బులు అడగడానికే ఫిబ్రవరి 11న ఆమె ఫ్లాట్‌కు వెళ్లినపుడు ముగ్గురి మధ్య వివాదం జరిగిందని తెలిపింది. ఈ క్రమంలో రాహుల్, ప్రత్యూష ఇద్దరూ తనపై దాడిచేసినపుడు తాను తిరగబడ్డానని తెలిపింది. తనను తాను రక్షించుకోడానికే ఆమెను కొట్టాల్సి వచ్చిందని తెలిపింది. అప్పు తీర్చమన్నందుకు తనపై అమానుషంగా ప్రవర్తించి దాడికి పాల్పడడంతో వారిపై స్థానిక బంగర్  నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్టు పేర్కొన్నారు. వాళ్లిద్దరి విజ్ఞప్తితోనే ఆ తర్వాత ఫిర్యాదును వెనక్కి తీసుకున్నట్టు తెలిపారు. ఇపుడు ప్రత్యూష ఆత్మహత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులకు ఈ విషయాలన్నీ తెలుసని వివరించారు. శనివారం తన తండ్రితో కలిసి బంగర్ నగర్ పోలీస్ స్టేషన్‌లో సలోని తన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు.

సలోని చెప్పిన వివరాలు ఇవీ..
2011లో  మోడలింగ్, యాక్టింగ్ కెరీర్ కోసం కోల్‌కతా నుంచి ముంబైకి వచ్చినపుడు రాహుల్‌తో పరిచయం ప్రేమకు దారితీసింది. ఈక్రమంలో ఇద్దరు కలిసి ఒక కంపెనీని ప్రారంభించారు. దీనికోసం సలోని రూ. 30 లక్షల పెట్టుబడి పెట్టింది. ఇంతలో తమ కామన్ స్నేహితుల ద్వారా రాహుల్, ప్రత్యూషల మధ్య సంబంధాన్ని తెలుసుకున్న ఆమె రాహుల్ ని నిలదీసింది. అవన్నీ అబద్ధాలని, వాటిని పట్టించుకోవద్దంటూ నమ్మబలికాడు.

ఈ గందరగోళం ఇలా కొనసాగుతుండగానే హఠాత్తుగా ఆగస్టు 10 న ప్రత్యూష పుట్టినరోజు సందర్భంగా టెలివిజన్లో వారి వివాహ  ప్రకటన విని నివ్వెరపోయి మర్నాడు రాహుల్ ని నిలదీయగా,  ఆమెకు సమాధానం చెప్పాల్సిన రాహుల్ దీనికి  బదులుగా  సలోని తండ్రికి ఫోన్ చేసి కూతుర్ని తీసుకుపొమ్మని చెప్పాడు. ఆయన వచ్చి రాహుల్ తోనూ, ప్రత్యూష తల్లిదండ్రులతోనూ మాట్లాడారు. తన కూతురు రాహుల్‌కు లక్షల రూపాయలు ఇచ్చి మోసపోయిందని, ఇలాంటి పరిస్థితే  ప్రత్యూషకు కూడా ఎదురయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు.  

మరోవైపు తనను ఎపుడూ కలవని వారు, రాహుల్ - ప్రత్యూష తనకు మధ్య  ఏం జరిగిందేంటో  తెలియనివారు కూడా..  తన గురించి మాట్లాడుతున్నారని  సలోని విమర్శించారు. తనపై నిరాధార ఆరోపణలు చేసిన అందరిపై పరువునష్టం దావా దాఖలు  చేసేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. రాహుల్ వ్యవహారం తనకుముందే తెలిస్తే అతనితో సన్నిహితంగా ఉండేదాన్ని కాదని వాపోయారు. ప్రస్తుతం తాను పీకల్లోతు అప్పుల్లో మునిగిపోయానని తెలిపారు.

మరిన్ని వార్తలు