స్టాలిన్ వచ్చినందుకు వెరీ హ్యాపీ: జయలలిత

24 May, 2016 18:05 IST|Sakshi
స్టాలిన్ వచ్చినందుకు వెరీ హ్యాపీ: జయలలిత

చెన్నై: ముఖ్యమంత్రిగా తాను ప్రమాణం చేసే కార్యక్రమంలో డీఎంకే నేత స్టాలిన్ కు వెనుక వరస సీటు కేటాయింపు విషయంపై తమిళనాడు సీఎం జయలలిత వివరణ ఇచ్చారు. స్టాలిన్ వస్తారని తెలుసునని, ఆయన రావడం తనకెంతో సంతోషాన్నిచ్చిందని ఆమె పేర్కొన్నారు. ప్రతిపక్షపార్టీ నేతలపై తనకు ఎలాంటి విభేదాలు లేవని, స్టాలిన్ కు ఉద్దేశపూర్వకంగా సీటు కేటాయింపు జరగలేదన్నారు. ప్రోటోకాల్ ప్రకారం అధికారులు వ్యవహరించారని అందులో భాగంగానే మొదటి వరసలో సీటు ఇవ్వలేదని, అంతేకానీ ప్రతిపక్ష పార్టీ నేతలను చిన్నచూపు చూపడం కాదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

నిజం చెప్పాలంటే జయలలిత తాజా ఎన్నికల్లో విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించారు. మూడు దశాబ్దాల తర్వాత తమిళ రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తిగా నిలిచారు. ఆమె మద్రాసులోని సెంటినరీ ఆడిటోరియంలో సోమవారం ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. జయలలిత సీఎంగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి స్టాలిన్ రెండో సారి హాజరయ్యారు. స్టాలిన్‌కు ఆడిటోరియంలో 16వ వరుసలో కుర్చీ కేటాయించడంపై డీఎంకే అధినేత కరుణానిధి మండిపడ్డారు. ఉద్దేశపూర్వకంగానే జయలలిత ఈ పని చేశారంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. సినీనటుడు శరత్ కుమార్‌కు ముందు వరుసలో సీటు ఇవ్వడాన్ని సాకుగా చూపిస్తూ కరుణానిధి ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఏది ఏమైతేనేం.. జయలలిత చేసిన పని సబబు కాదంటూ అక్కడ హాట్ టాపిక్ గా మారింది. కేబినెట్ ర్యాంకు స్థాయి, ప్రతిపక్ష హోదా స్థాయి కలిగిన వ్యక్తిని చివరి వరుసలో సీటు ఎలా కేటాయిస్తారంటూ డీఎంకే అగ్రనేతలతో పాటు సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఐదుసార్లు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన వ్యక్తికి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అగ్రనేతలను ఇలాంటి సందర్భాలలో ఎలా గౌరవించాలో జయలలితకు తెలియదా అంటే.. ఆమె చాకచక్యంగా వ్యవహరించారని అర్థమైపోతోంది.

మరిన్ని వార్తలు