అందుకే ఎంపీ పదవిని వదులుకున్నా: సిద్ధూ

25 Jul, 2016 14:17 IST|Sakshi
అందుకే ఎంపీ పదవిని వదులుకున్నా: సిద్ధూ

న్యూఢిల్లీ: సొంత రాష్ట్రమైన పంజాబ్ కు తనను దూరం చేయాలని బీజేపీ ప్రయత్నించిందని రాజ్యసభ పదవికి రాజీనామా చేసిన మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఆరోపించారు. సొంత రాష్ట్రం కంటే ఏ పదవి తనకు పెద్దది కాదని అన్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేసిన ఆయన సోమవారం తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. పంజాబ్ నా మాతృభూమి, నా సొంత రాష్ట్రాన్ని వదిలి ఉండలేనంటూ ఉద్వేగంగా మాట్లాడారు.

'పంజాబ్ నన్ను దూరం చేయాలని ప్రయత్నించారు. ఒకసారి సహించాను. ఏకంగా నాలుగుసార్లు ఇలాంటి ప్రయత్నం చేయడంతో సహించడం నా వల్ల కాలేదు. అందుకే రాజ్యసభ సభ్యత్వాన్ని వదులుకున్నా. నా ప్రజలను ఎలా వదులుకోగలను. పక్షులు కూడా తమ సొంత గూటిని వదిలిపోవు. నేను పంజాబ్ ను వదిలిపెట్టి ఎలా వెళ్లగలను. పార్టీ కంటే సొంత రాష్ట్రమే ముఖ్యం. పంజాబ్ కు మించిన పార్టీ లేదు. నా రాష్ట్రం కంటే ఏ పదవి పెద్దది కాదు. గత ఎన్నికల్లో కురుక్షేత్ర, పశ్చిమ ఢిల్లీ నుంచి పోటీ చేయమంటే నేను అంగీకరించలేదు. నా ప్రజలను మోసం చేయలేనని చెప్పా. ఎక్కడినుంచో పోటీ చేస్తే పంజాబ్ నా వల్ల ఎలాంటి మేలు జరుగుతుందని ప్రశ్నించాను. పంజాబ్, అమృతసర్ కు సేవ చేయాలని కోరుకున్నా'నని సిద్ధూ తెలిపారు.

బీజేపీకి రాజీనామా చేసే విషయం, ఆమ్ ఆద్మీ పార్టీలో చేరే అంశం గురించి సిద్ధూ ప్రస్తావించలేదు.

మరిన్ని వార్తలు