కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లపై ఐటీ దాడులు

13 Oct, 2019 04:17 IST|Sakshi

తమిళనాడులో రూ. 30 కోట్లు సీజ్‌

న్యూఢిల్లీ: తమిళనాడులోని ఓ కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి ఐటీ శాఖ రూ. 30 కోట్లు స్వాధీనం చేసుకుంది. నీట్‌లాంటి ప్రవేశ పరీక్షలకు ఈ ఇన్‌స్టిట్యూట్‌ శిక్షణ ఇస్తోందని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ (సీబీడీటీ) శనివారం వెల్లడించింది. నమక్కల్‌ కేంద్రంగా ఉన్న ఈ గ్రూపుకి సంబంధించిన 17 ప్రాంగణాలలో శుక్రవారం ఏకకాలంలో దాడులు జరిపామని, ప్రాథమిక అంచనాల ప్రకారం, ఆ గ్రూప్‌ ఆదాయం రూ. 150 కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలిపింది. ఈ బృందం ప్రధానంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకోసం విద్యాసంస్థలు, కోచింగ్‌ ఇనిస్టిట్యూట్‌లను నడుపుతోంది. ఈ ట్రస్ట్‌ నియంత్రణలో అనేక భాగస్వామ్య సంస్థలు, వ్యక్తులు ఉన్నారని తెలిపింది. సీబీడీటీ ఆదాయపన్ను శాఖ కోసం వివిధ విధానాలను రూపొందిస్తుంది.

శుక్రవారం నమక్కల్, పెరుండురై, కరూర్, చెన్నైలోని గ్రూప్‌ ప్రమోటర్ల ఇళ్లు, ప్రాంగణాలపై దాడులు జరిగాయి. ఫీజు రశీదులను విడివిడిగా రూపొందించడం ద్వారా సంస్థ గణనీయంగా పన్ను ఎగవేతలకు పాల్పడుతోందని వచ్చిన కచ్చితమైన సమాచారం మేరకు ఐటీ దాడులు చేశామని సీబీడీటీ వెల్లడించింది. ఫీజులో కొంత భాగాన్ని నగదు రూపంలో స్వీకరించడం, రశీదులను సైతం సాధారణ ఖాతాల పుస్తకాలలో నమోదు చేయకపోవడం లాంటి పనులకు సంస్థ పాల్పడిందని వెల్లడించింది. సోదాల సమయంలో డైరీలు, ఎలక్ట్రానిక్‌ స్టోరేజ్‌ పరికరాల్లో లెక్కలేనన్ని ఫీజు రశీదులను గుర్తించినట్లు తెలిపింది. బినామీ ఉద్యోగుల పేర్లతో లాకర్లు తెరిచారని, ప్రధాన బ్రాంచ్‌లోని లాకర్‌లో భారీ ఎత్తున నగదు స్వాధీనం చేసుకున్నామని బోర్డు తెలిపింది. ఉద్యోగులకు ఆదాయపన్నుకు అందకుండా నగదు రూపంలో జీతాలు చెల్లిస్తున్నారని తెలిపింది.

మరిన్ని వార్తలు