వెయ్యి కోట్ల పన్ను ఎగవేత!

11 Nov, 2017 02:39 IST|Sakshi

చెన్నై ఐటీ దాడుల్లో భారీగా బంగారం, వజ్రాలు స్వాధీనం

రెండోరోజూ కొనసాగిన ‘ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’

సాక్షి, చెన్నై: ‘ఆపరేషన్‌ క్లీన్‌ మనీ’లో భాగంగా చెన్నై సహా తమిళనాడులోని పలు ప్రాంతాల్లో శశికళ సన్నిహితుల ఇళ్లలో ఐటీ సోదాలు రెండో రోజూ కొనసాగాయి. ఈ సోదాల్లో శశికళ, ఆమె కుటుంబ సభ్యులు రూ. 1000 కోట్ల పన్ను ఎగవేసినట్లు ప్రాథమిక విచారణలో తేలినట్లు సమాచారం. తనిఖీల్లో పెద్ద ఎత్తున నగదు, బంగారు నగలు, వెండి, వజ్రాలు బయటపడినట్లు తెలిసింది.  పెద్ద సంఖ్యలో బినామీ సంస్థల ద్వారా నగదు బట్వాడా, బ్యాంకు ఖాతాలు, విదేశీ సంస్థల్లో పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు స్వాధీనంచేసుకున్నట్లు సమాచారం.

బంధువుల నుంచి పనిమనుషుల వరకు..
అక్రమాస్తుల కేసులో శిక్షననుభవిస్తున్న శశికళ, ఆమె భర్త నటరాజన్, సోదరుడు దివాకరన్, మేనల్లుడు దినకరన్‌లతో పాటు సన్నిహితులు, వారి సంస్థల్లో పనిచేస్తున్న సిబ్బంది, వారి బంధువులు, వారి వంట, పనిమనుషులు, జ్యోతిష్కుడు, వైద్యుడు, ఆడిటర్‌.. ఇలా ఆ కుటుంబంతో సంబంధమున్న వారి ఇళ్లల్లో, కార్యాలయాల్లో శుక్రవారం దాడులుచేశారు. రెండో రోజు 147 చోట్ల తనిఖీల్లో ఐటీ వర్గాలు నిమగ్నమయ్యాయి. పలుచోట్ల శశికళ, దినకరన్, దివాకరన్‌ మద్దతుదారులు దాడులకు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. శశికళ స్వగ్రామం మన్నార్‌గుడిలో ఉద్రిక్తత చోటుచేసుకోవడంతో ఆమె మద్దతుదారుల్ని పోలీసులు అరెస్టు చేశారు.  ఈ తనిఖీల్లో వెయ్యి కోట్ల మేరకు పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలు చిక్కినట్టు ఓ అధికారి పేర్కొన్నారు. అలాగే, మన్నార్‌గుడిలోని దివాకరన్‌ కళాశాలలో రూ.25 లక్షలు విలువగల నగలు, వెండి బయట పడ్డట్టు తెలిసింది. ప్రధానంగా పది బినామీ సంస్థల వివరాలతో పాటు, విదేశాల్లోని అనేక సంస్థల్లో శశికళ కుటుంబం పెట్టుబడులకు సంబంధించిన రికార్డులు, దస్తావేజుల్ని ఐటీ వర్గాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.

మరిన్ని వార్తలు