ఐటీ ఆఫీసర్‌ కొడుకు కిడ్నాప్‌, హత్య

22 Sep, 2017 13:29 IST|Sakshi
ఐటీ ఆఫీసర్‌ కొడుకు కిడ్నాప్‌, హత్య
సాక్షి, బెంగళూరు : ఆదాయపు పన్ను శాఖకు చెందిన ఓ సీనియర్‌ ఆఫీసర్‌ కొడుకుని కిడ్నాప్‌ చేసి, దారుణంగా హత్య చేశారు దుండగులు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. ఐటీ శాఖలో సీనియర్ అధికారిగా ఉద్యోగం చేస్తున్న నిరంజన్ కుమార్ కుమారుడు శరత్ (19), కెంగెరీలోని తన ఇంటికి సమీపంలో సెప్టెంబర్‌ 12న కిడ్నాప్‌కు గురయ్యాడు. ఈ కిడ్నాప్‌ కేసు విచారణ చేపట్టిన పోలీసులు, శుక్రవారం రోజు శరత్‌ మృతి చెందినట్టు గుర్తించారు. నగర శివార్లలో రామోహల్లి సరస్సులో శరత్‌ మృతదేహం లభ్యమైంది. ఇప్పటికే ఈ హత్య కేసుకు సంబంధించి శరత్‌ స్నేహితుడు విశాల్‌తో పాటు మరో ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 
సెప్టెంబర్‌ 12న కనిపించకుండా పోయిన శరత్‌, అప్పటి నుంచి ఫోన్‌కు కూడా దొరకకుండా పోయాడు. కిడ్నాప్‌ చేసిన నిందితులు శరత్‌ తల్లిదండ్రులను రూ.50 లక్షలు డిమాండ్‌ చేస్తూ.. అతని మొబైల్‌ నుంచే ఒక వాట్సాప్‌ వీడియోను పంపించారు. ఆ వీడియోలో శరత్ మాట్లాడుతూ మీరు ఐటీ దాడులు చేసిన బాధితులు నన్ను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెడుతున్నారని విలపించాడు. అంతేకాక తనను కిడ్నాప్‌ చేసిన వారు టెర్రరిస్టుల ఉన్నారని, వారి వల్ల సోదరికి కూడా ప్రమాదం ముంచి ఉన్నట్టు తెలిపాడు. ఒకవేళ శరత్‌ను విడుదల చేస్తే, ఇరకాటంలో పడతామని భావించిన కిడ్నాపర్లు అతని హత్య చేసినట్టు తెలిసింది. కిడ్నాపర్లు వాడిన కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతోంది. . 
మరిన్ని వార్తలు