క్లినిక్‌లలో 100 కోట్ల నల్లధనం

3 Dec, 2017 02:21 IST|Sakshi

బెంగళూరులో గుర్తించిన ఐటీ శాఖ

డాక్టర్లకు భారీగా రెఫరల్‌ ఫీజులు చెల్లిస్తున్నఐవీఎఫ్, డయాగ్నస్టిక్‌ కేంద్రాలు

బెంగళూరు: ఐవీఎఫ్‌ క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ కేంద్రాలతో కొందరు వైద్యులు సాగిస్తున్న రహస్య సంబంధాలు బెంగళూరులో బట్టబయలయ్యాయి. ప్రముఖ గైనకాలజిస్ట్‌ కామిని రావ్‌కు చెందిన క్లినిక్‌లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లలో సుమారు రూ.100 కోట్ల నల్లధనమున్నట్లు ఆదాయపన్ను అధికారులు గుర్తించారు. తమ దాడుల్లో రూ.1.4 కోట్ల నగదు, 3.5 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు శనివారం ఐటీ శాఖ ప్రకటించింది. అలాగే విదేశీ కరెన్సీ, కోట్లాది రూపాయల నిల్వలున్న విదేశీ ఖాతాలను కూడా కనుగొన్నట్లు తెలిపింది.

ఆయా కేంద్రాలకు రోగులను రెఫర్‌ చేస్తున్నందుకు బదులుగా అవి డాక్టర్లకు భారీగా చెల్లిస్తున్నట్లు తెలిసింది.  తమ సోదాల్లో ఆ ల్యాబ్‌లలో రూ.100 కోట్ల అప్రకటిత ఆదాయం ఉన్నట్లు కనుగొనగా, ఒక్కో ల్యాబ్‌లో డాక్టర్లకు చెల్లించిన రెఫరల్‌ ఫీజు రూ.200 కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేసింది. తమకు రోగులను పంపిన డాక్టర్లకు ల్యాబ్‌లు చెల్లిస్తున్న అనేక విధానాలను గుర్తించామని పేర్కొంది. ‘డాక్టర్లకు అందుతున్న కమిషన్‌ ల్యాబ్‌ను బట్టి మారుతుంది. ఎంఆర్‌ఐ పరీక్షలకు 35 శాతం, సిటీ స్కాన్, ఇతర పరీక్షలకు 20 శాతం చొప్పున ఇస్తున్నారు. 

అయితే ఈ చెల్లింపులను ల్యాబ్‌లు మార్కెటింగ్‌ ఖర్చులుగా చూపుతున్నాయి. కొన్నిసార్లు డాక్లర్లకు చెల్లించే రెఫరల్‌ ఫీజును ప్రొఫెషనల్‌ ఫీజుగా చూపుతున్నాయి. ఒప్పందంలో భాగంగా ఆసుపత్రులు డాక్టర్లను ఇన్‌–హౌస్‌ కన్సల్టెంట్లుగా నియమించుకుంటున్నాయి. కానీ వారు క్లినిక్‌లకు రారు. పేషెంట్లను చూడరు. రిపోర్టులు రాయరు. డాక్టర్లకు కమిషన్‌లు చేరవేసేందుకు కొన్ని ల్యాబ్‌లు కమిషన్‌ ఏజెంట్లను కూడా నియమించుకుంటున్నాయి’ అని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది.  

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా