బ్రహ్మచారినని.. వీసా ఇవ్వలేదు

23 Oct, 2016 06:48 IST|Sakshi
బ్రహ్మచారినని.. వీసా ఇవ్వలేదు
ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది శిష్యులతో పాటు, రూ. 4,500 కోట్ల పతంజలి సామ్రాజ్యానికి ఏకైక అధిపతి అయిన యోగా గురువు రాందేవ్ బాబాకు ఒకప్పుడు అమెరికా వీసా తిరస్కరించిందట. ఆయనకు బ్యాంకు అకౌంటు లేదని, బ్రహ్మచారి కావడం వల్ల వీసా రాలేదట. తర్వాత ఐక్యరాజ్య సమితిలో ప్రసంగించడానికి ఏకంగా పదేళ్ల పాటు అమలులో ఉండేలా వీసాను అందించి మరీ స్వయంగా అగ్రరాజ్యమే ఆయనను ఆహ్వానించింది. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్‌లో ఉన్న విషయం తెలిసిందే. తనకు అమెరికా వీసా తిరస్కరించిన విషయాన్ని రాందేవ్ బాబా గ్లోబల్ ఇన్వెస్టర్ సద్సులో చెప్పారు. 
 
తొలిసారి తాను అమెరికా వీసాకు దరఖాస్తు చేసుకోగా.. వాళ్లు తిరస్కరించారన్నారు. ఎందుకని కారణం అడిగితే, మీకు బ్యాంకు ఖాతా లేదని, మీరు పెళ్లి చేసుకోలేదని చెప్పారన్నారు. బహుశా ఇవి కాక వాళ్లకు వేరే ఏవో కారణాలు ఉండి ఉంటాయని, అవేంటో చెప్పాలని తాను ఎంతగా అడిగినా వాళ్లు మాత్రం అప్పట్లో వీసా ఇవ్వలేదని చెప్పారు. అయితే ఏ సంవత్సరంలో ఈ ఘటన జరిగిందీ ఆయన చెప్పలేదు. 
 
అనిల్ అంబానీ, గోపీచంద్ హిందూజా లాంటి బడా పారిశ్రామికవేత్తలతో పాటు కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి నాయకులఉ పాల్గొన్న వేదికను ఆయన పంచుకున్నారు. స్వామీజీలు ఎప్పుడూ అంతర్జాతీయ పౌరులు అవుతారని ఆయన అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ధార్ జిల్లాలో పతంజలి గ్రూపు రూ. 500 కోట్లతో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ స్థాపిస్తోంది. 
మరిన్ని వార్తలు