నాడు అవినీతి... నేడు అభివృద్ధి

27 May, 2016 01:08 IST|Sakshi
నాడు అవినీతి... నేడు అభివృద్ధి

యూపీఏ.. ఎన్డీయే పాలనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
సహరాన్‌పూర్: యూపీఏ పరిపాలన కింద దేశంలో ఆవరించిన ఉన్న నిరాశానిస్పృహలను తమ ప్రభుత్వ రెండేళ్ల పాలన తొలగించిందని.. ఇప్పుడు దేశంలో ఆశ, అభివృద్ధి విస్తరించాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పేర్కొన్నారు. తన ప్రభుత్వం పేదలకు, రైతులకు అంకితమైన ప్రభుత్వమని.. ప్రజా ధనం దోపిడీని నిరోధించిందని చెప్పారు. కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వ రెండో వార్షికోత్సవం సందర్భంగా గురువారం ఉత్తరప్రదేశ్‌లోని సహరాన్‌పూర్‌లో నిర్వహించిన బహిరంగసభలో మోదీ ప్రసంగించారు.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న యూపీలో మోదీ నాలుగు సభల్లో పాల్గొననుండగా అందులో మొదటి సభ ఇది. రాష్ట్ర ప్రజలకు దగ్గరయ్యే లక్ష్యంతో.. తాను రైతుల కోసం ఆలోచించే యూపీ వాలానేనని పేర్కొన్నారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. కాంగ్రెస్ సారథ్యంలోని గత ప్రభుత్వం అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయిందంటూ.. తమ ప్రభుత్వం అటువంటి ఆరోపణలేవీ లేకుండా నిజాయితీగా పనిచేస్తోందని చెప్పారు. దాదాపు గంటన్నర సేపు ప్రసంగించిన మోదీ.. అవినీతి అంశాలతో పాటు తన పేదల అనుకూల, రైతుల అనుకూల పథకాల నుంచి పదే పదే ఉటంకించారు. మోదీ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
 
ఒక్క రూపాయైనా లూటీ జరిగిందా?
‘‘రెండేళ్ల కిందట దేశం మునిగిపోయిందని చాలా మంది అనుకున్నారు. భారత్ మునిగిపోయిందని, పరిస్థితులు మారబోవని వాళ్లు అనేవారు. అప్పుడు అంతా నిరాశాపూరిత వాతావరణం నెలకొంది. ఇప్పుడు ఆశ, ఉత్సాహం నెలకొన్నాయి.
  రెండేళ్ల కిందట వార్తా పత్రికలు, టీవీ చానళ్లను చూడండి. అత్యున్నత స్థాయిలో అవినీతి అన్నది సాధారణంగా ఉండేది. నేను ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాను. గత ప్రభుత్వాలు దేశాన్ని ఎలా దోచుకున్నాయనేది చూసి నేను దిగ్భ్రాంతికి లోనయ్యాను. ప్రభుత్వాలు ఏర్పాటయ్యేది దోచుకోవటానికా? ఆ సంస్కృతికి ముగింపు పలకటానికి నేను ఇక్కడ ఉన్నా. మా ప్రభుత్వం కనీసం ఒక్క రూపాయి అయినా దోచుకున్నట్లు చెప్పే వార్త ఏదైనా మీరు విన్నారా?  
 
లోక్‌సభ ఎన్నికల తర్వాత బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ నేతగా నేను ఎన్నికైనపుడు.. నా ప్రభుత్వం పేదలకు అంకితమవుతమవుతందని నేను హామీ ఇచ్చాను. అప్పటి నుంచీ నేను తీసుకున్న ప్రతి నిర్ణయమూ ఆ దిశగానే తీసుకున్నాను. రెండేళ్ల నా కృషిని మీరు చూసినట్లయితే.. ప్రతి నిర్ణయమూ పేదలు పేదరికంపై పోరాడేలా వారిని సాధికారం చేసేందుకు తీసుకున్నవే.
  అన్ని సమస్యలకూ అభివృద్ధే పరిష్కారం. ఇతర మాటలన్నీ ఎన్నికల్లో గెలవటం కోసం, ఓటు బ్యాంకు రాజకీయాలు చేయటం కోస మే. నా రికార్డును చాలా మంది భూతద్దంలో పరిశీలిస్తున్నారు. దీనిని నేను ఆహ్వానిస్తున్నా. ప్రభుత్వం ప్రతి క్షణానికీ లెక్క చెప్పాల్సిందే.’’
 
ప్రధాన సేవకుడిగా లెక్క చెప్తున్నా...
‘‘ఒక ‘ప్రధాన సేవకుడి’గా నేను చేసిన పని గురించి ప్రజలకు లెక్క చెప్తున్నాను. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వనరుల పంపిణీ గతంలో 65:35 దామాషాలో ఉండేది. దానిని మా ప్రభుత్వం మార్చింది. ఇప్పుడు 65 శాతం రాష్ట్రాలకు వెళుతోంది. పంచాయతీలకు రెండు లక్షల కోట్లకు పైగా నిధులు ఇచ్చాం. గత ప్రభుత్వ పాలన వరకూ విద్యుత్ లేకుండా ఉన్న 18,000 గ్రామాల్లో 7,000 గ్రామాలను మా ప్రభుత్వం కేవలం 300 రోజుల్లో విద్యుదీకరించింది. నేను అధికారంలోకి వచ్చేటప్పటికి చెరకు రైతుల బకాయిలు రూ. 14,000 వరకూ పెరిగాయి.

నా ప్రభుత్వం చేపట్టిన చర్యల ఫలితంగా అవి ఇప్పుడు రూ. 700-880 కోట్లకు తగ్గాయి. రైతుల పట్ల చెరకు మిల్లుల యజమానులు గతంలో హీనంగా వ్యవహరించినట్లు వ్యవహరిస్తే సహించేది లేదు. 2022లో దేశం 75వ స్వాతంత్య్రదినోత్సవం జరుపుకునే సరికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మేం ఒట్టు పెట్టుకున్నాం. నా ప్రభుత్వం వికాస్ పర్వ్ నిర్వహిస్తోంది. నా మంత్రులందరూ దేశం మొత్తం తిరిగి తాము చేసిన పని గురించి వివరిస్తారు. నేను యూపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీని కాబట్టి నేను ‘యూపీ వాలా’ని. నాకు మీ ఆశీస్సులు కావాలి.’’
 
125 కోట్ల మందీ నా కుటుంబం: మోదీ ఈ సభలో.. అన్ని వర్గాల వారితో సంఘీభావంపై కీలకమైన సందేశం ఇస్తూ.. ‘గత ప్రభు త్వ హయాంలో పథకాలకు మత, కులపరమైన పేర్లు పెట్టడం అలవాటుగా ఉండేది. కానీ నా ప్రభుత్వ పథకాలు నా కుటుంబమైన 125 కోట్ల మంది భారతీయులందరి కోసం ఉద్దేశించినవి. కులం, జాతి, మతం వంటివి మమ్మల్ని నడిపించవు’ అని అన్నారు.
 
ఎంతో చేశాం.. చేయాల్సింది చాలా..
వాల్‌స్ట్రీట్ జర్నల్ ఇంటర్వ్యూలో మోదీ

వాషింగ్టన్: తమ రెండేళ్ల పాలనలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని.. అయితే మున్ముందు చేయాల్సింది చాలా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా అధ్యక్షుడు ఒబామా ఆహ్వానం మేరకు వచ్చే నెలలో ఆ దేశంలో మోదీ పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాల్‌స్ట్రీట్ జర్నల్‌కు మోదీ ఇంటర్వ్యూ ఇచ్చారు. తమ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రపంచ వ్యవహారాల్లో భారతదేశం అత్యంత కీలక పాత్ర పోషిస్తోందని, అమెరికాతో సంబంధాలు మరింత బలోపేతమయ్యాయన్నారు.

భారతదేశంలో వేగవంతమైన అభివృద్ధి కోసం తాను బాటలు వేశానని.. ఆ మార్గంలో పయనించడానికి రాష్ట్రాలు ముందుకు రావాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. అవినీతిని అరికట్టేందుకు చర్యలు తీసుకున్నానని, గ్రామీణ మౌలిక సదుపాయాల కల్పనలో లోపాలు సరిదిద్దానని మోదీ చెప్పుకొచ్చారు. కీలకమైన వస్తువులు, సేవలపై పన్ను (జీఎస్టీ) బిల్లు ఈ ఏడాది పార్లమెంటు ఆమోదం పొందుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. కార్మిక చట్టాలను సవరించామని.. వాటిని అమలు చేయాల్సిన బాధ్యత రాష్ట్రాలపై ఉందన్నారు.
 
ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం సరికాదు
ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థలను విక్రయించడం సరికాదని మోదీ అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర వహిస్తున్నాయన్నారు. అభివృద్ధి చెందుతున్న ఏ దేశంలోనైనా ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వ రంగం నుంచి అకస్మాత్తుగా బయటపడటం సాధ్యం కాదని, అలా వదిలించుకోకూడదని అన్నారు.
 
మోదీ సర్కారు చేసిందేంటి?
చర్చకు సిద్ధమన్న కాంగ్రెస్

న్యూఢిల్లీ: కేంద్రంలో సర్కారు ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా బీజేపీ సంబరాలు జరుపుకోవటంపై కాంగ్రెస్‌తోపాటు విపక్షాలు మండిపడ్డాయి. ఈ రెండేళ్లలో ఎన్డీఏ సర్కారు సాధించిందేంటని ప్రశ్నించాయి. ఎన్నికల హమీల్లో ఏ ఒక్కటీ అమలు చేయకుండా.. గిమ్మిక్కులతో ప్రజలు మోసం చేశారని కాంగ్రెస్ విమర్శించింది. కేవలం పత్రికలు, చానెళ్ల ద్వారానే బీజేపీ ప్రభుత్వం నడుస్తోందని.. దీనిపై బహిరంగ చర్చకు సిద్ధమని కాంగ్రెస్ సీనియర్ నేతలు డిమాండ్ చేశారు.

అచ్ఛేదిన్ పేరుతో అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు ఆధ్వర్యంలోని ఈ రెండేళ్లు.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశం ఎదుర్కొన్న అత్యంత దురదృష్టకరమైన కాలమని పవర్‌పాయిట్ ప్రజెంటేషన్‌లో ఆరోపించారు. ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ప్రధాని కార్యాలయం అంతర్జాతీయ ట్రావెల్ ఏజెన్సీగా మారిందని ఆప్ విమర్శించింది. రెండేళ్ల పాలనపై ప్రచారానికి రూ.1000 కోట్లు ఖర్చు చేస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఆరోపించారు. సరిహద్దు భద్రత, ద్రవ్యోల్బణం, పథకాలు ప్రజలకు చేరటం వంటి అంశాల్లో మోదీ సర్కారు దారుణంగా విఫలమైందని ఎన్డీఏ భాగస్వామి శివసేన ఆరోపించింది.
 
వైద్యుల పదవీ విరమణ వయసు 65కు!
* కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైద్యులందరికీ వర్తిస్తుంది: మోదీ
* ప్రతి నెలా గర్భిణీలకు ఉచిత వైద్యం చేయాలని పిలుపు

సహరాన్‌పూర్: దేశంలో వైద్యుల కొరత కారణంగా ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును 65 సంవత్సరాలకు పెంచనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహరాన్‌ఫూర్ సభలో ప్రకటించారు. ఈ నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఈ వారంలో ఆమోదం తెలుపుతుందని వెల్లడించారు. కేంద్రం కానీ రాష్ట్రం కానీ ఏ ప్రభుత్వం కింద పనిచేసే వైద్యులకైనా ఈ నిర్ణయం వర్తిస్తుందని చెప్పారు.

‘‘దేశవ్యాప్తంగా మరింత ఎక్కువ మంది వైద్యుల అవసరం ఉంది. కానీ ఆ వ్యత్యాసాన్ని గత రెండేళ్ల నా ప్రభుత్వ కాలంలో పూరించటం సాధ్యం కాలేదు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యుల పదవీ విరమణ వయసు కొన్ని రాష్ట్రాల్లో 60 సంవత్సరాలుగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో 62 సంవత్సరాలుగా ఉంది. తగినన్ని సంఖ్యలో వైద్య కళాశాలలు ఉన్నట్లయితే మనకు మరింత మంది వైద్యులు ఉండేవారు. కొరత కనిపించేది కాదు. రెండేళ్లలో వైద్యులను తయారు చేయటం కష్టం. కానీ పేద కుటుంబాలను వైద్యులు లేకుండా జీవించే పరిస్థితిలోకి నెట్టివేయజాలం.

కాబట్టి.. మన వైద్యుల పదవీ విరమణ వయసును రాష్ట్రాల్లో అయినా, కేంద్ర ప్రభుత్వంలో అయినా 65 ఏళ్లకు పెంచేలా కేంద్ర మంత్రివర్గం ఈ వారంలో నిర్ణయం తీసుకుంటుందని నేను దేశ ప్రజలందరికీ ప్రకటిస్తున్నా’’ అని పేర్కొన్నారు. అలాగే.. క్షేత్రస్థాయిలోకి మరింత మంది వైద్యులు అందుబాటులో ఉండేలా చేసేందుకు మరిన్ని వైద్య కళాశాలలను స్థాపించేందుకు తన ప్రభుత్వం వేగంగా కృషి చేస్తోందని చెప్పారు. అంతకుముందు.. ప్రతి నెలా తొమ్మిదో రోజున గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య సేవలు అందించాలని వైద్యులకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. అలా చేయటం.. పేదల్లో రోగాలను పరిష్కరించేందుకు తన ప్రభుత్వం చేస్తున్న కృషికి తోడవుతుందన్నారు.

మరిన్ని వార్తలు