సైన్యంలో చేరతా అమర జవాన్‌ భార్య

18 Feb, 2019 08:31 IST|Sakshi

దేశ సేవ చేస్తా; నా భర్త కలను నెరవేరుస్తా

అమర జవాన్‌ గురు సతీమణి కళావతి వెల్లడి

  గురు స్మృతుల్లో కుటుంబం..  దుఃఖంతో అనారోగ్యం పాలు

కుమారుడు దేశసేవలో ఉన్నాడని గర్వించే తల్లిదండ్రులు, భర్త రాక కోసం మధురానుభూతులతో నిరీక్షించే సతీమణి గుండెల్లో ఇప్పుడు అంతులేని విషాదం తాండవిస్తోంది. కొద్దిరోజుల కిందటివరకు తమ మధ్యనే ఉన్న ఆత్మీయుడు మంచుకొండల నడుమ నుంచి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవడం ఆ కుటుంబాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. నాలుగురోజుల నుంచి అన్నపానీయాలు లేక విలపిస్తూ మంచం పట్టారు.  

మండ్య: ‘నా భర్త స్వప్నాన్ని ఉగ్రవాదులు ధ్వంసం చేశారు. ఆయన కలను నెరవేర్చడానికి నేను సైన్యంలో చేరడానికి సిద్ధం. దేశ సేవ చేస్తా’ అని అమరవీరుడు గురు సతీమణి కళావతి ప్రకటించారు. పుల్వామా ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సీఆర్‌పీఎఫ్‌ జవాను గురు (33) స్మృతులను తలుచుకొని తల్లిదండ్రులు, భార్య ఇప్పటికీ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సెలవుల్లో ఇంటికి వచ్చిన సమయంలో గురు తమతో గడిపిన క్షణాలను గుర్తుచేసుకుని పదేపదే ఆవేదన చెందుతున్నారు. 14వ తేదీన మరణవార్త తెలిసిననాటి నుంచి తిండీ నిద్రకు దూరమై గురును స్మరిస్తున్నారు.   

పాకిస్థాన్‌ను నాశనం చేయాలి: తండ్రి హన్నయ్య  
గురు తండ్రి హన్నయ్య మాట్లాడుతూ.. గురు తన కుమారుడని చెప్పుకోవడానికి తమకు ఎంతో గర్వంగా ఉందన్నారు. గురుతో పాటు ఎంతోమంది భారత సైనికులను పొట్టనపెట్టుకున్న ఉగ్రవాదులు, ఉగ్రవాదులను పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌ను సర్వనాశనం చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ మనవడిని కూడా భారతసైన్యంలో చేర్పిస్తానని తెలిపారు. గురు భార్య కళావతి మాట్లాడుతూ.. తన భర్త మరో పదేళ్లపాటు సైన్యంలో సేవలు అందించాలని కలలు కనేవారన్నారు. అయితే ఉగ్రవాదులు ఆ కలను సర్వనాశనం చేశారని విలపించారు. భర్త కలను తాను నెరవేర్చుతానని, సైన్యంలో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆమె ఆవేశంగా చెప్పారు.  

ఆస్పత్రిలో చికిత్స  
నాలుగు రోజులుగా దుఃఖిస్తూ అస్వస్థతకు గురైన ముగ్గురు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గురును కోల్పోవడంతో గుడిగెరె గ్రామంలో కూడా మౌనవాతావరణం నెలకొంది. గురుతో గడిపిన క్షణాలు తలుచుకొని గ్రామస్థులు, స్నేహితులు కన్నీటి పర్యతంమయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గురు కుటుంబ సభ్యులను ఆదివారం సీఆర్‌పీఎఫ్‌ కమాండెంట్‌ ప్రదీప్‌ పరామర్శించి భారత సైన్యం అందించిన వీరమరణ పత్రాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం గురు అంత్యక్రియలు నిర్వహించిన ప్రాంతాన్ని సందర్శించారు. పలువురు గురు తండ్రిని కలిసి ఆర్థిక సహాయాన్ని అందజేశారు.  

గురు కుటుంబానికి ఆర్థిక సహాయం  
పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన గురు కుటుంబ సభ్యులను ఆదివారం ప్రముఖులతో పాటు ప్రజలు సాంవత్వన తెలిపి ఆర్థిక సహాయం అందించారు.గురు కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి డీసీ తమ్మణ్ణ కోడలు కవిత సంతోష్‌ రూ.25 వేల నగదు అందజేశారు. శ్రద్ధాంజలి, పరామర్శలు సరిపోవని, దొంగదెబ్బతో సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులను అంతమొందించనపుడే సైనికుల ఆత్మకు శాంతి చేకూరుతుందని ఆమె అన్నారు. బెల్‌బాటం కన్నడ చిత్రం హీరో హీరోయిన్లు రిషభ్‌ శెట్టి, హరిప్రియ, డైరెక్టర్‌ సంతోష్‌కుమార్‌లు గురు కుటుంబ సభ్యులను పరామర్శించి రూ.75వేల ఆర్థిక సహాయం అందించారు.  

ఆత్మాహుతికి సిద్ధం
ఆత్మాహుతి దాడి చేసి భారత సైనికులను హత్య చేసిన ఉగ్రవాదులు,పాకిస్థాన్‌ సైనికులపై ప్రతీకారం తీర్చుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నానని అందుకు అదే తరహాలో ఆత్మాహుతి దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ చేతన్‌ అనే యువకుడు సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేసిన వీడియో వైరల్‌గా మారింది.
సైనికులపై జరిగిన దాడిని జీర్ణించుకోలేకపోతున్నానని శత్రువలపై ప్రతీకారం తీర్చుకోవడానికి మనసు పరితపిస్తోందని వీడియోలో పేర్కొన్నాడు.  

మరిన్ని వార్తలు