అక్టోబర్ 2న నేనూ చీపురు పడతా: మోదీ

26 Sep, 2014 02:33 IST|Sakshi
అక్టోబర్ 2న నేనూ చీపురు పడతా: మోదీ

న్యూఢిల్లీ: పరిసరాల పరిశుభ్రత కోసం వారానికి కనీసం 2 గంటలైనా కేటాయించాలని ప్రధానమంత్రి మోదీ ప్రజలను కోరారు. క్లీన్ ఇండియా కార్యక్రమంలో రాజకీయ నాయకులు, మతపెద్దలు, మేయర్లు, సర్పంచ్‌లు, పారిశ్రామికవేత్తలు సహా అంతా పాల్గొనాలని, అక్టోబర్ 2న తాను కూడా ఒక చీపురు పట్టుకుని ఇందులో పాలుపంచుకుంటానని గురువారం విడుదల చేసిన ఒక ప్రకటననలో తెలిపారు. పరిశుభ్రత గాంధీజీకి చాలా ఇష్టమైన అంశమని, ఆయన 150వ జయంతి (2019, అక్టోబర్ 2) నాటికి దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చి ఆయనకు ఘన నివాళులర్పిద్దామన్నారు.
 
కాగా, ప్రభుత్వం చేపట్టిన క్లీన్ ఇండియా కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. రైల్వే స్టేషన్లు, కార్యాలయాలను శుభ్రం చేసే కార్యక్రమంలో మంత్రులు, ఎంపీలు పాల్గొనాలని, తమ నియోజకవర్గ పరిధిలోని రైల్వే స్టేషన్లో వారు ఆ కార్యక్రమం చేపట్టాలని రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీలందరికీ లేఖలు రాశానన్నారు. రైల్వే ట్రాకులపై చెత్త వేసే వారిపై జరిమానా విధించాల్సిన అవసరం ఉందన్నారు.
 
క్లీన్ ఇండియా లోగో ఆవిష్కరణ
వచ్చే ఐదేళ్లలో దేశాన్ని పరిశుభ్ర భారత్‌గా మార్చేందుకు ఉద్దేశించిన ‘స్వచ్ఛ్ భారత్ మిషన్’ లోగోను గురువారం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. ‘స్వచ్ఛత వైపు ఒక అడుగు’ అనే ట్యాగ్‌లైన్‌తో మహాత్మాగాంధీ కళ్లజోడును లోగోగా రూపొందించారు.  క్లీన్ ఇండియా కోసం దాదాపు రూ. 2లక్షల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేయనుందని, అందులో పట్టణాల్లో ఈ కార్యక్రమం అమలు కోసం పట్టణాభివృద్ధి శాఖ రూ. 62 వేల కోట్లను కేటాయించనుందని వెంకయ్యనాయుడు వెల్లడించారు.

మరిన్ని వార్తలు