కూలిన ఐఏఎఫ్ కొత్త విమానం

29 Mar, 2014 03:36 IST|Sakshi
కూలిన ఐఏఎఫ్ కొత్త విమానం

ఐదుగురు సిబ్బంది మృత్యువాత
  కొండను ఢీకొట్టడంతో ప్రమాదం!
 
 న్యూఢిల్లీ/జైపూర్: భారత వైమానిక దళానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల కొనుగోలు చేసిన అమెరికా తయూరీ రవాణా విమానం ఒకటి శుక్రవారం గ్వాలియర్ సమీపంలో కుప్పకూలింది. ప్రమాద సమయంలో అందులో ఉన్న మొత్తం ఐదుగురు సిబ్బంది మరణించారు. జైపూర్‌లోని రక్షణ శాఖ వర్గాల కథనం ప్రకారం.. సి-130 జే అనే ఈ అత్యాధునిక రవాణా విమానం ఉదయం 10 గంటల సమయంలో రోజువారీ కసరత్తులో భాగంగా ఆగ్రా వైమానిక స్థావరం నుంచి బయలుదేరింది.
 
 అరుుతే 11 గంటల సమయంలో గ్వాలియర్ వైమానిక స్థావరానికి పశ్చిమంగా 70 మైళ్ల దూరంలో.. గోటాఘాట్ ప్రాంతం వద్ద చంబల్ నది ఒడ్డున ఈ విమానం కుప్పకూలిందని రక్షణ శాఖ తెలిపింది. ఇద్దరు వింగ్ కమాండర్లు పి.జోషి, ఆర్.నాయర్, ఇద్దరు స్క్వాడ్రన్ లీడర్లు కె.మిశ్రా, ఎ.యూదవ్ (నేవిగేటర్), వారంట్ ఆఫీసర్ కె.పి.సింగ్ ఈ ప్రమాదంలో మరణించినట్లు పేర్కొంది. ప్రమాదానికి గల కారణాలపై విచారణకు ఆదేశించినట్లు వైమానిక దళ ప్రతినిధి ఒకరు న్యూఢిల్లీలో చెప్పారు. చిన్న కొండను ఢీకొట్టిన విమానం కుప్పకూలి మంటల్లో చిక్కుకున్నట్టుగా సమీప గ్రామస్తుల కథనాన్ని బట్టి తెలుస్తోందని కరౌలి జిల్లా కలెక్టర్ చెప్పారు.
 
  సుమారు రూ.6వేల కోట్ల వ్యయంతో అమెరికా నుంచి కొనుగోలు చేసిన ఆరు సి-130 జే సూపర్ హెర్క్యులస్ విమానాలను రక్షణ శాఖ ఇటీవలే ఐఏఎఫ్‌లో ప్రవేశపెట్టింది. ఈ విమానం 20 టన్నుల వరకు బరువును రవాణా చేయగలదు. అతి త క్కువ ఎత్తులో ఎగరడం వంటి వ్యూహాత్మక కసరత్తు కోసం ఈ తరహా విమానాలు రెండు టేకాఫ్ తీసుకోగా ఇందులో ఒకటి ప్రమాదానికి గురైందని అధికారులు చెప్పారు. గ్రౌండ్ కంట్రోల్‌తో సంబంధాలు కోల్పోయేముందు అత్యవసర పరిస్థితికి సంబంధించిన ఎలాంటి సమాచారం విమానం నుంచి అందలేదన్నారు.
 

మరిన్ని వార్తలు