రాఫెల్‌ డీల్‌ అవసరమే

13 Sep, 2018 04:03 IST|Sakshi

ఫైటర్‌ జెట్ల కొనుగోలుకు ఐఏఎఫ్‌ చీఫ్‌ ధనోవా సమర్థన

భారత్‌ తీవ్రమైన ప్రమాదాన్ని ఎదుర్కొంటోందని వెల్లడి

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 36 రాఫెల్‌ ఫైటర్‌ జెట్లను ఫ్రాన్స్‌ నుంచి కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని భారత వాయుసేన(ఐఏఎఫ్‌) చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా సమర్థించారు. గతంలో కూడా ఇలా అత్యవసరంగా భారత్‌ యుద్ధ విమానాలను కొనుగోలు చేసిందని తెలిపారు. బుధవారమిక్కడ ధనోవా మాట్లాడుతూ.. ‘చైనా తన వాయుసేన సామ ర్థ్యాన్ని గణనీయంగా పెంచుకుంటోంది. దేశ సరిహద్దులోని టిబెట్‌లో యుద్ధ విమానాలు, క్షిపణి వ్యవస్థలను మోహరిస్తోంది. ఇండియా కూడా ఇందుకు తగ్గట్లు వాయుసేనలో ఆధునీకరణ చేపట్టాలి.

పక్కనే రెండు అణ్వ స్త్ర దేశాలు (చైనా, పాక్‌) ఉన్నటువంటి విచిత్ర పరిస్థితిని భారత్‌ ఎదుర్కొంటోంది. వీరి ఉద్దేశాలు రాత్రికి రాత్రి మారిపోవచ్చు. చైనా దగ్గర 1,700 ఫైటర్‌ జెట్లు ఉండగా, వీటిలో 800 జెట్లు నాలుగో తరానికి చెందినవే. ఒకవేళ ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తలెత్తితే వీటిలో చాలామటుకు రంగంలోకి దిగుతాయి. ప్రస్తుతం భారత్‌ చాలా ప్రమాదకరమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోని మరే దేశానికి ఈ స్థాయిలో ప్రమాదం లేదు’ అని చెప్పారు. ఒకవేళ భారత్‌ 42 స్క్వాడ్రన్‌ జెట్లను సమకూర్చుకున్నా,  చైనా–పాక్‌ల సామర్థ్యంకన్నా తక్కువగానే ఉంటుందన్నారు.

>
మరిన్ని వార్తలు