దుస్సాహసానికి పాల్పడితే ఊరుకునేది లేదు!

20 Aug, 2019 14:39 IST|Sakshi

న్యూఢిల్లీ : పాకిస్తాన్‌ దుస్సాహసానికి పాల్పడితే సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు తాము సిద్ధంగా ఉన్నామని భారత వైమానిక దళ చీఫ్‌ బీఎస్‌ ధనోవా పేర్కొన్నారు. సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడితే ఉపేక్షించేదిలేదని దాయాది దేశాన్ని హెచ్చరించారు. ఉద్రిక్త పరిస్థితుల్లో భారత వైమానిక దళం ఉపయోగించే పరికరాలు, వాటి ద్వారా పరిస్థితులను అదుపులోకి తెచ్చే తీరును వివరించే పుస్తకాలను రక్షణ శాఖా మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో కలిసి మంగళవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీఎస్‌ ధనోవా మాట్లాడుతూ..‘ సరిహద్దుల్లో శత్రువుల కదలికలు ఉన్నా లేకపోయినా భారత వాయుసేన ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుంది. ఒక్కోసారి పౌర విమానాలు కూడా హద్దులు దాటి వస్తాయి. అలాంటి పరిస్థితులను అంచనా వేసి అందుకు తగ్గట్లుగా వ్యవహరించడం మాకు తెలుసు. అయితే శత్రుసేనలు దాడికి సిద్ధపడితే వారిని సమర్థవంతంగా తిప్పికొట్టగలము’ అని పేర్కొన్నారు.

ఇక యుద్ధ విమానాల గురించి ధనోవా మాట్లాడుతూ..‘ రక్షణ శాఖ పరికరాలు, యుద్ధ విమానాల తయారీకి పూర్తిగా స్వదేశీ పరిఙ్ఞానంపై ఆధారపడలేము. అలా అని అన్ని ఉత్పత్తులు విదేశాల నుంచి కొనుగోలు చేయలేము. అవసరాన్ని బట్టి పాత యుద్ధ విమానాల స్థానంలో అత్యాధునిక సాంకేతికత కలిగిన విమానాలను ఉపయోగిస్తాం’ అని తెలిపారు. ఇక వాయుసేన గురించి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ...ఉగ్ర శిబిరాలపై మెరుపుదాడులతో భారత వైమానిక దళం సత్తా చాటిందన్నారు. ఈ చర్య ద్వారా భారత సాయుధ బలగాల స్థాయి ఏమిటో శత్రు దేశానికి అర్థమైందని ప్రశంసలు కురిపించారు.

    

మరిన్ని వార్తలు