అభినందన్‌ వెన్నెముకకు గాయం

4 Mar, 2019 04:15 IST|Sakshi
ఆదివారం అభినందన్‌ను కలుసుకున్న రక్షణ శాఖ సహాయ మంత్రి సుభాష్‌ రావు భామ్రే

అల్లరిమూక దాడిలో దెబ్బతిన్న పక్కటెముక

శరీరంలో నిఘా పరికరాల్లేవు

అభినందన్‌ను ప్రశ్నిస్తున్న భద్రతాధికారులు

మళ్లీ కాక్‌పిట్‌లోకి వెళ్లాలని ఆత్రుతగా ఉందన్న అభినందన్‌  

న్యూఢిల్లీ: పాకిస్తాన్‌ చెర నుంచి విడుదలైన భారత వాయుసేన(ఐఏఎఫ్‌) వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌కు వెన్నెముక కింది భాగంలో గాయమైనట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అలాగే పాకిస్తాన్‌లో అల్లరిమూకలు చేసిన దాడిలో అభినందన్‌ పక్కటెముక ఒకటి దెబ్బతిందని వెల్లడించాయి. ఎంఆర్‌ఐ స్కాన్‌లో ఆయన శరీరంలో ఎలాంటి బగ్స్‌(సూక్ష్మ నిఘా పరికరాలు) లేనట్లు తేలిందని పేర్కొన్నాయి. ఢిల్లీ కంటోన్మెంట్‌లోని రీసెర్చ్‌ అండ్‌ రెఫరల్‌ ఆసుపత్రిలో అభినందన్‌కు  చికిత్స కొనసాగుతోంది.

భారత భూభాగంలోకి ప్రవేశించిన పాక్‌ ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని తన మిగ్‌–21 ద్వారా అభినందన్‌ కూల్చివేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా తన విమానం కూడా దెబ్బతినడంతో పారాచూట్‌తో అభినందన్‌ ఎజెక్ట్‌ అయ్యారు. విమానం నుంచి బయటకొచ్చే క్రమంలోనే ఆయన వెన్నెముకకు గాయమై ఉంటుందని  భావిస్తున్నారు. అభినందన్‌ ఆరోగ్యస్థితిని అంచనా వేసే ‘కూలింగ్‌ డౌన్‌’ ప్రక్రియలో భాగంగా మరిన్ని పరీక్షలు చేయనున్నారు.

కొనసాగుతున్న విచారణ..
పైలట్‌ అభినందన్‌ను ఆదివారం భద్రతాసంస్థల ఉన్నతాధికారులు విచారించారు. పాక్‌ ఆర్మీకి చిక్కాక ఐఏఎఫ్‌ రహస్యాలను ఏమైనా బయటపెట్టారా? అనే కోణంలో ఈ విచారణ సాగుతోంది.  ఈ విచారణ మరికొన్ని రోజులు కొనసాగవచ్చని అధికారులు వెల్లడించారు. వీలైనంత త్వరగా తిరిగి కాక్‌పిట్‌లో కూర్చునేందుకు అభినందన్‌ ఆత్రుతగా, ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారన్నారు. ఎఫ్‌–16 యుద్ధ విమానాన్ని కుప్పకూల్చిన తొలి భారత పైలట్‌గా అభినందన్‌ చరిత్ర సృష్టించారన్నారు.

‘మహవీర్‌ అహింసా పురస్కారం’..
అభినందన్‌కు ‘భగవాన్‌ మహవీర్‌ అహింసా పురస్కారం’ను అందజేస్తామని అఖిల భారతీయ దిగంబర్‌ జైన్‌ మహాసమితి ప్రకటించింది. ఈ పురస్కారాన్ని అందుకోబోతున్న తొలి వ్యక్తి అభినందనేనని సమితి చైర్మన్‌ మందిరా జైన్‌ తెలిపారు.

త్వరలో బెంగళూరుకు..
సాక్షి, బెంగళూరు: భారత పైలట్‌ అభినందన్‌ వర్ధమాన్‌ త్వరలో బెంగళూరుకు రానున్నట్లు ఐఏఎఫ్‌ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్‌ ఫిట్‌గా ఉన్నారా? లేదా? తెలుసుకునేందుకు బెంగళూరులోని హెచ్‌ఏఎల్‌లో ఉండే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఏరోస్పేస్‌లో సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ పరీక్షల్లో ఫిట్‌నెస్‌ చాటుకుంటే మళ్లీ యుద్ధవిమానాలు నడిపేందుకు అభినందన్‌ను అనుమతిస్తామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు