భారత వాయుసేనలోకి ‘డకోటా’

24 Apr, 2018 11:21 IST|Sakshi
డగ్లస్‌ డీసీ 3 డకోటా యుద్ధ విమానం

సాక్షి, న్యూఢిల్లీ : భారతీయ వాయుసేన(ఐఏఎఫ్‌)లోకి పురాతన డగ్లస్‌ డీసీ 3 విమానం వచ్చి చేరనుంది. పూర్తి స్థాయిలో పునరుద్ధరించిన ఈ విమానాన్ని రాజ్యసభ ఎంపీ రాజీవ్‌ చంద్రశేఖరన్‌ ఐఏఎఫ్‌కు బహుమతిగా ఇచ్చారు. రెండో ప్రపంచ యుద్ధంలో, 1947 ఇండో-పాకిస్తాన్‌ యుద్ధాల్లో దీన్ని వినియోగించారు.

ఈ సమయంలో డకోటా అని ముద్దుగా పిలుచుకునే ఈ విమానానికి చంద్రశేఖరన్‌ తండ్రి పైలట్‌గా వ్యవహరించారు. డకోటాతో ఉన్న అనుబంధానికి గుర్తుగా బ్రిటన్‌ నుంచి చంద్రశేఖరన్‌ దాన్ని కొనుగోలు చేశారు. ఆరేళ్లుగా లండన్‌లో మరమ్మతులు చేయిస్తున్నారు.

గత యూపీఏ ప్రభుత్వ హయాంలోనే డకోటాను ఐఏఎఫ్‌కు బహుమతిగా ఇచ్చేందుకు చంద్రశేఖరన్‌ ప్రతిపాదన చేశారు. అయితే, చంద్రశేఖరన్‌ ప్రతిపాదనను అప్పటి ప్రభుత్వం తిరస్కరించింది. బీజేపీ హయాంలో చంద్రశేఖరన్‌ ప్రతిపాదనకు ఆమోద ముద్ర పడింది. ప్రస్తుతం ఐఏఎఫ్‌లో డకోటా చేరేందుకు అన్ని రకాల క్లియరెన్సులను పూర్తి చేస్తున్నట్లు చంద్రశేఖరన్‌ తెలిపారు. మరికొద్ది నెలల్లో యూకే నుంచి విమానం భారత్‌కు వస్తుందని చెప్పారు.

మరిన్ని వార్తలు