బ్రహ్మోస్‌ క్షిపణి పరీక్ష విజయవంతం

23 May, 2019 04:38 IST|Sakshi
బ్రహ్మోస్‌ క్షిపణితో నింగిలో దూసుకెళ్తున్న సుఖోయ్‌ యుద్ధవిమానం. (ఇన్‌సెట్లో) క్షిపణిని ప్రయోగిస్తున్న దృశ్యం

న్యూఢిల్లీ: సూపర్‌సోనిక్‌ క్రూయిజ్‌ క్షిపణి బ్రహ్మోస్‌ ఏరియల్‌ వెర్షన్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు భారత వైమానిక దళం (ఐఏఎఫ్‌) బుధవారం వెల్లడించింది. సుఖోయ్‌ యుద్ధ విమానం ఎస్‌యు–30 ఎంకేఐ ద్వారా ఈ పరీక్ష నిర్వహించారు. 2.5 టన్నుల బరువుండి, ఆకాశం నుంచి భూ ఉపరితలంపైకి ప్రయోగించే ఈ క్షిపణి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. తద్వారా ఐఏఎఫ్‌ యుద్ధ సామర్థ్యాలను కూడా ఇది పెంచుతుందని మిలిటరీ అధికారులు చెప్పారు. బ్రహ్మోస్‌ క్షిపణి 2.8 మ్యాక్‌ వేగంతో ప్రయాణిస్తుంది. ‘విమానం నుంచి ఈ క్షిపణిని ఏ సమస్యలూ లేకుండా ప్రయోగించగలిగాం. నిర్దేశించిన మార్గంలో అది ప్రయాణించి లక్ష్యాన్ని ఛేదించింది’ అని ఐఏఎఫ్‌ అధికార ప్రతినిధి గ్రూప్‌ కెప్టెన్‌ అనుపమ్‌ బెనర్జీ చెప్పారు.

మరిన్ని వార్తలు