ఈ పరీక్షలు... పాసైతేనే...

2 Mar, 2019 04:04 IST|Sakshi

ఎట్టకేలకు అభినందన్‌ భారత్‌లో అడుగుపెట్టారు. అన్ని ప్రక్రియలు ముగిసినా 2 రోజులపాటు పాక్‌ ఆర్మీకి చిక్కడంతో అభినందన్‌కు కొన్ని పరీక్షలైతే తప్పనిసరిగా నిర్వహించాలి. పరాయిదేశానికి చిక్కిన వారు తిరిగి మాతృభూమికి చేరుకున్నప్పుడు కచ్చితంగా కొన్ని నియమ నిబంధనలైతే పాటిస్తారు. అవేంటంటే..

► అభినందన్‌ను నేరుగా భారత వాయుసేన ఇంటెలిజెన్స్‌ యూనిట్‌కు అప్పగిస్తారు.

► అభినందన్‌ శారీరకంగా ఎంత ఫిట్‌నెస్‌తో ఉన్నారో కొన్ని వైద్య పరీక్షలు చేస్తారు.

► శత్రు దేశం ఆయన దుస్తుల్లో కానీ, శరీర భాగాల్లో కానీ ఏమైనా బగ్‌లు.. అంటే గూఢచర్యానికి సంబంధించిన ఎలక్ట్రానిక్‌ పరికరాలు అమర్చిందేమోనన్న అనుమానం తీర్చకోవడానికి శరీరం మొత్తం బగ్‌ స్కాన్‌ చేస్తారు.

► వింగ్‌ కమాండర్‌ మానసిక స్థితి ఎలా ఉందో కూడా పరీక్షలు చేసి తెలుసుకుంటారు. శత్రు దేశానికి చిక్కిన తర్వాత వాళ్లేమీ అతిథి మర్యాదలు చేయరు. ప్రత్యర్థి దేశ రక్షణ రహస్యాలను తెలుసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తారు. గుచ్చి గుచ్చి ప్రశ్నలు వేస్తారు. ఎవరైనా పెదవి విప్పకపోతే చిత్రహింసలు పెడతారు. ఆ ఒత్తిడిని తట్టుకోలేక దేశ రహస్యాలేమైనా చెప్పారేమోనన్న దిశగా అభినందన్‌ను విచారిస్తారు.  

► ఆ తర్వాత ఇంటెలిజెన్స్‌ బ్యూరో (ఐబీ), రీసెర్చ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) అధికారులు కూడా అభినందన్‌ను క్షుణ్నంగా విచారిస్తారు.

► సాధారణ యుద్ధ ఖైదీలైతే ఈ రెండు సంస్థల విచారణ చేయనక్కర్లేదు. కానీ అభినందన్‌ను యుద్ధఖైదీగా పరిగణించాలో అక్కర్లేదో అన్న సందేహాలు ఉండటంతో ఐబీ, రా అధికారులు కూడా ప్రశ్నలు వేస్తారు.  

సందేహాల నివృత్తి తర్వాతే ఇంటికి..
మొత్తం వ్యవహారంలో ఐఏఎఫ్‌ ఇంటెలిజెన్స్‌ అధికారుల విచారణే అత్యంత క్లిష్టమైన ప్రక్రియని పేరు చెప్పడానికి ఇష్టపడని ఐఏఎఫ్‌ అధికారి ఒకరు వెల్లడించారు. అభినందన్‌ పాక్‌ ఆర్మీకి బందీగా ఉన్న సమయంలో ఎంత ధీరత్వాన్ని ప్రదర్శించినప్పటికీ, భారతీయ అధికారులకు ఆయనంటే ఎంత గౌరవం ఉన్నప్పటికీ ఇంటెలిజెన్స్‌కి ఉండే అనుమానాలు ఉంటాయి. పాక్‌లో బందీగా ఉన్నప్పుడు వాళ్లు ఏ ప్రశ్నలు వేశారు? ఎలాంటి సమాచారం రాబట్టడానికి ప్రయత్నించారు? వాళ్లు పెట్టే టార్చర్‌ భరించలేక లొంగిపోయి వారి గూఢచారిగా తిరిగి మన దేశానికి వచ్చారా? ఇలాంటి సందేహాలన్నీ పూర్తిస్థాయిలో నివృత్తి అయ్యాకే అభినందన్‌ను ఇంటికి వెళ్లనిస్తారు. ఆ తర్వాతే విధుల్లోకి తీసుకుంటారని వివరించారు. చదవండి...(అభినందన్‌ ఆగయా..)

కార్గిల్‌ యుద్ధం జరిగినప్పుడు పాక్‌కి చిక్కి భారత్‌కు తిరిగి వచ్చిన పైలట్‌ కె.నచికేతను విచారించిన సమయంలో దగ్గరుండి ఈ వ్యవహారాలన్నీ చూశానన్నారు. ఫీల్డ్‌ మార్షల్‌ కరియప్ప కుమారుడు కేసీ నంద కరియప్పను 1965 యుద్ధ సమయంలో బంధించి తిరిగి వచ్చాక జరిగిన ఘటనలపై ఆ అధికారి పూర్తిస్థాయిలో అధ్యయనం చేశారు. పాక్‌ వారిని ఎన్ని రకాలుగా ఒత్తిడి చేసినా భారత్‌ రహస్యాలు వాళ్లు బయటపెట్టలేదని చెప్పారు. అభినందన్‌ విషయంలో కూడా తమకు ఆ నమ్మకం ఉందని, కానీ తప్పనిసరిగా చేయాల్సిన పరీక్షలు, విచారణలు చేయాల్సిందేనని చెప్పారు. అభినందన్‌ అయినా, మరో యుద్ధ ఖైదీ అయినా ఈ విధివిధానాలు పూర్తి చేసినప్పుడు ఎంతో గౌరవం ఇస్తామని చెప్పారు.

మరిన్ని వార్తలు