కేంద్రమంత్రిపై ఐఏఎస్‌ల గుర్రు

30 May, 2018 03:13 IST|Sakshi

ధర్మేంద్ర ప్రధాన్‌పై ఒడిశా సీఎంకు ఫిర్యాదు

భువనేశ్వర్‌:  పెట్రోలియం, సహజవనరుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వివాదంలో చిక్కుకున్నారు. భువనేశ్వర్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాన్‌ ఐఏఎస్‌ అధికారులతో పాటు ఒడిశా ఐటీ కార్యదర్శి అశోక్‌ మీనాను విమర్శించారు. దీంతో మంత్రి వ్యవహారశైలిపై మండిపడ్డ ఒడిశా ఐఏఎస్‌ అధికారుల సంఘం.. ముఖ్యమంత్రి పట్నాయక్‌ను కలసి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. ఐటీ మంత్రి రవిశంకర్, ప్రధాన్‌లు భువనేశ్వర్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ‘ప్రజలకోసం కేంద్రం అమలుచేస్తున్న పథకాలను ఒడిశాలో రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా రంగుపులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు.

ఈ వ్యవహారంలో ఐఏఎస్, ఒడిశా అడ్మినిస్ట్రేటివ్‌ సర్వీస్‌(ఓఏఎస్‌) అధికారులదే కీలకపాత్ర’ అని అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వ సహకారం లేకుండా కేంద్ర పథకాలను అమలు చేయడం అసాధ్యం. అంతమాత్రాన సోషల్‌మీడియాలో ఒకరి(కేంద్రం) పేరుకు బదులు మరొకరి(రాష్ట్రం) పేరును చేర్చడం సరికాదు. మీనాజీ.. ఇలాంటి పనుల్ని ఇకపై చేయకండి’ అని ప్రధాన్‌ అన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో మీనా పేరును ప్రధాన్‌ మూడుసార్లు ప్రస్తావించారు. కాగా, ఓ ఐఏఎస్‌ అధికారిని మంత్రి లక్ష్యంగా చేసుకోవడంపై తమ నిరసన తెలియజేసినట్లు ఐఏఎస్‌ అసోసియేషన్‌ కార్యదర్శి విశాల్‌ దేవ్‌ తెలిపారు. ప్రధాన్‌ వ్యాఖ్యలు రాజ్యాంగ విలువల్ని ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు